ఇప్పుడంతా ఇదే అంటున్నారు. నిజంగానే ఒక్క సినిమా కోసం అందర్నీ మార్చేసాడు సుకుమార్. గుర్తు పట్టలేనంత కొత్తగా పుష్ప సినిమాలో అందర్నీ చూపిస్తున్నాడు లెక్కల మాస్టారు. ఇదివరకు సుకుమార్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు కనీసం ఓ ఐడియా ఉండేది. ఆయన అర్థం కాని హాలీవుడ్ సినిమాలు చేస్తాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా భారీగానే జరిగేది. నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే అర్థం కాకుండా ఉందని.. అలాంటి కథకు ఇలాంటి టిపికల్ స్క్రీన్ ప్లే ఉండటమే కొంప ముంచిందని స్వయంగా సుకుమార్ ఒప్పుకున్నాడు.
నిజానికి ఆ రెండు సినిమాలు మంచి సినిమాలే అయినా కూడా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే కారణంగానే అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయాయి. వన్ సినిమాను ఇప్పటికీ తన కెరీర్లో ఓ బెస్ట్ సినిమాగా చెప్పుకుంటాడు మహేష్ బాబు. మరోవైపు నాన్నకు ప్రేమతో కూడా ఎన్టీఆర్‌కు అంతే. అయితే ఆ తర్వాత తన రూట్ మార్చుకున్నాడు లెక్కల మాస్టారు. రంగస్థలం సినిమాతో పూర్తిగా మారిపోయాడు.
రామ్ చరణ్‌తో రూరల్ విలేజ్ డ్రామా చేసి అదరహో అనిపించాడు. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ మార్చి పారేసాడు. బాహుబలి మాత్రమే ఉంచి.. ఏకంగా 124 కోట్ల షేర్ వసూలు చేసింది రంగస్థలం. సుకుమార్ కానీ మాస్ సినిమా చేసాడంటే తామంతా బ్యాగులు సర్దుకోవాల్సిందే అని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన మాటలను అక్షరాలా నిజం చేసి చూపించాడు లెక్కల మాస్టారు.