తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులున్నారు.. అయితే వారసులతో పోలిస్తే వారసురాళ్లు మాత్రం తక్కువగానే వచ్చారు. అందులోనూ సక్సెస్ అయిన వాళ్లు ఇంకా తక్కువ. ప్రస్తుతానికి మంచు లక్ష్మి మాత్రమే కారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. మరోవైపు రాజశేఖర్ కూతుళ్ళు శివానీ, శివాత్మిక ఇప్పటికీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు.
కొణిదెల వారమ్మాయి నిహారిక కూడా సక్సెస్ కాలేకపోయింది. మూడు నాలుగు సినిమాలు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంది. మరికొందరు వారసురాళ్లు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన వారసురాలు ఒక్కరు కూడా లేరు. తమిళంలో శృతి హాసన్ లాంటి వాళ్లు స్టార్స్ అయ్యారు కానీ తెలుగులో మాత్రం ఆ సీన్ రిపీట్ కాలేదు.
ఇప్పటికే శ్రీకాంత్ తనయుడు రోషన్ నాలుగేళ్ళ కింద నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు పెళ్లి సందD సినిమా చేస్తున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుంది. తాజాగా కూతురిని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని శ్రీకాంత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన నట వారసురాలు మేధ వయసు 17 ఏళ్ళు.