తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఈయన సినిమాలు తగ్గించాడు కానీ ఒకప్పుడు రాజశేఖర్‌కు స్టార్ డమ్ ఉండేది. ముఖ్యంగా 90ల్లో చిరంజీవితో పోటీ పడి మరీ సినిమాలు చేసాడు ఈయన. రాజశేఖర్, చిరు ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా జరిగేవి. ఒకప్పుడు అద్భుతమైన విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిపోయాడు రాజశేఖర్. ఈయన ఖాతాలో ఎన్నో సంచలన విజయాలు కూడా ఉన్నాయి.
రాజశేఖర్ సినిమా వచ్చిందంటే పండగ చేసుకునే వాళ్లు ఫ్యాన్స్. అయితే మిలినియం తర్వాత జోరు తగ్గించాడు ఈ హీరో. మిగిలిన హీరోల స్పీడ్ ముందు రాజశేఖర్ తట్టుకోలేకపోయాడు. కాస్త వెనకబడిపోయాడు. గత 20 ఏళ్ళలో రాజశేఖర్ నుంచి వచ్చిన హిట్ సినిమాలు తక్కువే. అప్పుడెప్పుడో మా అన్నయ్య, మనసున్న మారాజు తర్వాత మధ్యలో ఓ సారి ఎవడైతే నాకేంటి, గోరింటాకు సినిమాలతో హిట్ కొట్టాడు.
ఆ తర్వాత నాలుగేళ్ల కింద గరుడ వేగ సినిమా రాజశేఖర్ ఉన్నాడనే సంగతి గుర్తు చేసింది కానీ హిట్ కాదు. కల్కి కూడా అంతే. ఈ రెండు సినిమాలతో ఆడియన్స్‌కు తన ఉనికి గుర్తు చేసాడు ఈ సీనియర్ హీరో. తాజాగా ఈయన శేఖర్ సినిమాతో సంక్రాంతికి వస్తున్నాడు. ఈ సందర్భంగా భార్య జీవితతో కలిసి ఇంటర్వ్యూకు వచ్చిన రాజశేఖర్.. తన జీవితంలోనే అత్యంత గడ్డు రోజుల గురించి గుర్తు చేసుకున్నాడు. ఈయనకు కరోనా సోకి నెల రోజులకు పైగానే హాస్పిటల్లో ఉన్నాడు.
అప్పటి పరిస్థితుల గురించి వివరించాడు ఈ సీనియర్ హీరో. తాజాగా తన భార్య జీవితతో కలిసి అలీతో సరదాగా షోకి గెస్ట్‌గా వచ్చాడు రాజశేఖర్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో రాజశేఖర్, జీవిత ఎన్నో విషయాలను పంచుకున్నారు. రాజశేఖర్ ఎంబిబిఎస్ చదివినా కూడా చివరికి యాక్టర్ అయ్యారు. అసలు యాక్టర్ ఎందుకు అవ్వాలనిపించిందని అలీ అడగ్గా.. ‘ఎప్పుడు ఎగ్జామ్స్ కోసం చదువుతానో.. అప్పుడు యాక్టర్ అవ్వాలని ఎక్కువ అనిపించేది’ అని తెలిపాడు.
కానీ తనకు నత్తి ఉండడంతో.. ఏ దర్శకుడినో, నిర్మాతనో కలిసి తనకు అవకాశం ఇవ్వమని అడిగిన తర్వాత.. నత్తి వల్ల తీసేస్తే చాలా అసహ్యం అయిపోతుందేనని ఆలోచించానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు రాజశేఖర్. తాజాగా ఈయన నటిస్తున్న ‘శేఖర్’ సినిమా గురించి అడిగాడు అలీ. ఈ సినిమాకు జీవిత ఎందుకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందో తెలిపాడు రాజశేఖర్.