తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఏం చెప్పాలి..? ఈయన క్రేజ్ కొలవాలంటే కొత్త పరికరం ఏదైనా కనిపెట్టాల్సిందే. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ ఈయనది. ఎప్పుడో ఆ రేంజ్ దాటిపోయాడు పవర్ స్టార్. హిట్లు, ఫ్లాపులు పక్కనబెట్టండి.. ముందు ఆయన సినిమా వస్తే చాలు అనుకునే ఫ్యాన్స్ ఉంటారు. అంత క్రేజ్ పవన్ అంటే అభిమానులకు. అలాగే దర్శక నిర్మాతలకు కూడా పవన్‌తో సినిమా చేయాలని అంతే కలలు కంటుంటారు.
ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మునపటిలా సినిమాలు చేస్తాడా లేదా అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ముందు కంటే వేగంగా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు పవన్. తన పార్టీ నడుపుకోడానికి కచ్చితంగా కొన్ని డబ్బులు అయితే కావాలి. అది సినిమాలు తప్ప మరోటి తీసుకురాలేవని పవన్‌కు కూడా తెలుసు. అందుకే వీలైనంత వరకు ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్.
ప్రస్తుతం ఈయన 5 సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. అందులో భీమ్లా నాయక్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి సినిమాలకు కూడా కమిటయ్యాడు పవర్ స్టార్.
ప్రస్తుతం తాను బిజీలో అంతకంటే ఒక సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించలేనని తెగేసి చెప్తున్నాడు పవన్. ఈ కండీషన్ ఓకే అంటేనే సినిమా ఓకే చేస్తున్నాడు పవన్. ఎందుకంటే ఎలక్షన్స్ మరో రెండేళ్లు కూడా లేవు. అందుకే ఇప్పట్నుంచే జనసేనను సిద్ధం చేసుకుంటున్నాడు. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు మ్యాగ్జిమమ్ 60 నుంచి 75 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తున్నాడు పవన్.