సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ చేసినా కూడా తన కంటెంట్‌పై ఉన్ననమ్మకంతో బంగార్రాజును పండగ బరిలో దింపాడు నాగార్జున. ఈయన సినిమాపై ముందు నుంచి కూడా మంచి అంచనాలున్నాయి. పైగా పండక్కి పెద్ద సినిమాలు వచ్చినా కూడా తాను మాత్రం వెనక్కి తగ్గే ముచ్చటే లేదని ముందు నుంచి చెప్తున్నాడు నాగార్జున. తనది పండగ లాంటి సినిమా.. పండక్కి మాత్రమే వచ్చే సినిమా అని చెప్పాడు నాగార్జున. అందుకే మూడు నెలల్లోనే సినిమాను సిద్ధం చేసాడు.
అనుకున్నట్లుగానే ఈయన బంగార్రాజు భారీ అంచనాలతో జనవరి 14న విడుదలైంది. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 800 పైగా థియేటర్స్‌లో విడుదలైంది. సంక్రాంతికి మరో భారీ సినిమా కూడా లేకపోవడంతో బంగార్రాజుకు భారీగానే థియేటర్స్ దక్కాయి. అయితే ఎంత భారీగా విడుదలైనా కూడా.. కరోనా వైరస్ దారుణంగా ఉండటంతో కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందని ముందు నుంచి విశ్లేషకులు అంచనాలు వేస్తూనే ఉన్నారు.
అయితే వాళ్లందరి అంచనాలు తలకిందులయ్యాయి. బంగార్రాజు తొలిరోజే అందరికీ షాకిచ్చాడు. ట్రేడ్ పండితులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యేలా బంగార్రాజు సినిమాకు కలెక్షన్స్ సునామి కురుస్తుంది. నాగార్జున కెరీర్లోనే ఇప్పటి వరకు లేనట్లు వసూళ్ల ప్రభంజనం సృష్టించాడు బంగార్రాజు. నాగ చైతన్య, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడం.. పండక్కి పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో కుటుంబ ప్రేక్షకులు కూడా బంగార్రాజు కోసం క్యూ కడుతున్నారు.
దాదాపు 39 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగింది బంగార్రాజు. అక్కినేని అభిమానులు ఈ చిత్రం చూసి పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అయితే ఒకేసారి నాగార్జున డ్యూయల్ రోల్‌తో పాటు నాగ చైతన్య కూడా కనిపించడంతో స్క్రీన్ షేక్ అయిపోతుంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియస్ సంయుక్తంగా సినిమాను నిర్మించారు.