'మా' ఎన్నికలు జరిగి వారం రోజులు అయిపోతున్నా కూడా ఇప్పటికీ దాని గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ చేస్తున్న పనులు చూసి అంతా షాక్ అయిపోతున్నారు. గెలిచిన వాళ్లు పండగ చేసుకుంటుంటే.. ఓడిన వాళ్లు మాత్రం కారణాలు వెతుక్కుంటున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు చేసిన తర్వాత విషయం మరింత పెద్దదైపోయింది.
ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సారి ఎన్నికలు మెగా వర్సెస్ మంచుగా మారిపోయాయి. మెగా కుటుంబం సపోర్ట్ చేయడంతో ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో నిలబడ్డాడు. ఆయన నిలబడిన తర్వాత పోటీగా మంచు విష్ణు వచ్చాడు. అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోయిన తర్వాత.. మెగా కుటుంబం ఓడిపోయింది.. చిరంజీవి ఓడిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
మోహన్ బాబు ఆధిపత్యం మొదలైంది.. చిరు సపోర్ట్ చేసినా కూడా ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో విభేదాలు.. ఎన్నో ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఇప్పటికీ మా అసోసియేషన్ గురించి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మా ఎన్నికల గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు మంచు విష్ణు.
ముఖ్యంగా చిరంజీవి, మోహన్ బాబు మధ్య జరిగిన యుద్ధంగా ఈ ఎన్నికలను హైలైట్ చేసిన వాళ్లకు మంచు విష్ణు ఒక్కటే మాట చెప్పాడు. ఇది తన తండ్రి మోహన్ బాబు, చిరంజీవి మధ్య జరిగిన వార్ కాదని చెప్పుకొచ్చాడు. ఎన్నికల తర్వాత ఈ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారని తెలిపాడు ఈయన. ప్రస్తుతం జరుగుతున్న అనేక పరిణామాలపై ఈ ఇద్దరూ చర్చించుకున్నారని మీడియాకు తెలిపాడు విష్ణు.
తన తండ్రి మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసాడని.. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారని కూడా కన్ఫర్మ్ చేసాడు మా అధ్యక్షుడు. అకారణంగా తన పేరు ప్రచారం చేసారని.. అంతే తప్ప తాను ఇరు వర్గాల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేదని స్పష్టంగా మోహన్ బాబుకు చిరంజీవి చెప్పినట్లు తెలుస్తుంది. ఎవరు మంచి చేస్తే వాళ్లకే తన సపోర్ట్ ఉంటుందని చిరు ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు.
ఈ సారి కూడా ఇదే జరిగిందని.. ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మోహన్ బాబుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ నిజమైతే నాగబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు చిరంజీవి మాటలు విన్న తర్వాత మోహన్ బాబు కూడా కూల్‌గానే రియాక్ట్ అయ్యాడని.. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారని తెలుస్తుంది.
ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయిందని.. ఇకపై అందరం కలసికట్టుగా ఉండాలని మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందరం ఒక తల్లి బిడ్డలుగా కలిసి ఉందామని ముందు నుంచి చిరు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇదే మాట మీదున్నట్లు చిరు చెప్పాడని తెలుస్తుంది. త్వరలోనే చిరంజీవి, మోహన్ బాబు కలిసి మీడియా ముందుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.