సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి కూడా 2019లో మంచి విజయం సాధించింది. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కాలేదు జస్ట్ హిట్ అనిపించిందంతే. 99 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 102 కోట్లు షేర్ వసూలు చేసి బయటపడింది. మహేష్ కెరీర్లో తొలి 100 కోట్ల షేర్ సాధించిన సినిమా ఇదే. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు.
కిరాక్ పార్టీ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న నిఖిల్.. ఈ ఏడాది ‘అర్జున్ సురవరం’తో వచ్చాడు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం చాలా తక్కువ అంచనాలతో వచ్చింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ చిత్రం 6 కోట్లకు అమ్మితే 9.50 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో అయితే ఏకంగా 3.60 కోట్ల షేర్ తీసుకొచ్చింది.
నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అతడి స్నేహితుడు స్వరూప్ ఆర్ఎస్జే ఈ సినిమాను తెరకెక్కించాడు. నవీన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. దాదాపు 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.
రాక్షసుడు సినిమాతో వరస ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కనీసం ఓ యావరేజ్ అందుకున్నాడు ఈయన. 12 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రాక్షసుడు సినిమా చివరికి 12 కోట్ల దగ్గరే ఆగింది. అద్భుతమైన టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల రూపంలో మాత్రం అది కనిపించలేదు.