తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే హీరోల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ అందుకునే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. అందులో రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. వీళ్లతో సినిమా చేయాలంటే హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో.. వాళ్లకు కూడా అంత ఇచ్చుకోవాల్సిందే. వాళ్ల నుంచి సినిమాలు వచ్చాయి అంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ బద్దలైపోతుంది.
ఆ నమ్మకంతోనే నిర్మాతలు కూడా ఆ దర్శకులు అడిగినంత ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే సినిమాలో భాగస్వామ్యం కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు దాదాపు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుడుగా త్రివిక్రమ్ తర్వాత స్థానంలో ఉన్నాడు.
నవంబర్ 7న ఈయన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆయన జీవితంలో జరిగిన అరుదైన సంఘటనల గురించి.. ఆసక్తికరమైన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ అందుకున్న తొలి పారితోషికం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
1998లో ఆయన ఇండస్ట్రీకి వచ్చాడు. అప్పటికే లెక్చరర్‌గా పని చేస్తున్న ఈయన.. సినిమాల కోసం అది మానేసి వచ్చేసాడు. 1-2 సంవత్సరాలు అవకాశాల కోసం బాగా తిరిగిన తర్వాత స్రవంతి రవికిషోర్, రామోజీరావు లాంటి నిర్మాతలు నిర్మించిన సినిమాలతో త్రివిక్రమ్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న ఆయన తొలి పారితోషకం మాత్రం వేలల్లోనే ఉంది.
అప్పట్లో ఒక సినిమా కోసం కేవలం 2 వేల రూపాయలు మాత్రమే పారితోషికంగా మాటల మాంత్రికుడు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సునీల్, ఆర్పీ పట్నాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూమ్మేట్స్గా ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఆ సమయంలో అవకాశం రావడమే గొప్ప విషయంగా ఫీలయ్యేవాళ్ళు.. దానికితోడు పారితోషికం కూడా ఇస్తున్నారంటే బోనస్ అన్నమాట.
నువ్వే కావాలి సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న తర్వాత త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ పెరిగింది. దర్శకుడు కాక ముందు అత్యధిక పారితోషికం అందుకున్న మాటల రచయితగా టాలీవుడ్లో చరిత్ర సృష్టించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మల్లీశ్వరి, జై చిరంజీవ సమయంలోనే ఆయన సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకున్నాడు. అప్పుడు దర్శకులకు కూడా అంత పారితోషికం లేదంటే అతిశయోక్తి కాదు.
ఇక ఇప్పుడు దర్శకుడిగా ఆయనకు తిరుగులేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది, జనవరి 12, 2022 సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. డిసెంబర్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కనుంది.