పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రానాతో నటిస్తున్న మల్టీస్టారర్ కూడా ఉంది. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు కూడా చేసారు. ఒరిజినల్ ఉన్నదున్నట్లు తీస్తే ఇద్దరి కారెక్టర్స్ సేమ్ టూ సేమ్ ఉంటాయి.
ఓ డబ్బున్న వ్యక్తి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్‌గా బిజూ మీనన్ నటించారు. అక్కడ ఈ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువ కాదు. ఇద్దరూ పర్ఫెక్టు సింకులో నటించారు. అందుకే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది.
అయితే తెలుగులోకి వచ్చేసరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ అయ్యాడు. దాంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రానా, పవన్ అనేసరికి.. పవర్ స్టార్ పది మెట్లు పైనే ఉంటాడు. దాంతో ఇప్పుడు ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ రీమేక్ కాస్తా పవన్ సినిమా అయిపోయింది. రానా నటిస్తున్నా కూడా దాన్ని మల్టీస్టారర్ అనట్లేదెవ్వరూ. ఎక్కువగా పవన్ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా పవన్ పేరు మీదే జరుగుతుంది.
ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడంటున్నారే కానీ మరో హీరోగా గుర్తించడం లేదనేది దగ్గుబాటి అభిమానుల వాదన. అందులో నిజం కూడా లేకపోలేదు. ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ అంటే అక్కడ ఇద్దరి హీరోల పేర్లు టైటిల్లో ఉన్నాయి. అయ్యప్పన్, కోశి ఇద్దరి మధ్య జరిగే గొడవే సినిమా కాబట్టి.. ఇద్దరి పేర్లు పెట్టారు. కానీ రీమేక్‌కు వచ్చేసరికి అది ‘భీమ్లా నాయక్’ అంటూ పవన్ సినిమా అయిపోయింది.
ఈ టైటిల్ పెట్టినపుడే రానాకు అన్యాయం జరిగిందని అంతా ఫిక్సైపోయారు. ఒరిజినల్లో ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ అంటే అయ్యప్పన్, కోశీ.. ఇద్దరి పేర్లు ఉన్నాయి. తెలుగులో అలా కాకుండా కేవలం పవన్ పేరు పెట్టారు. దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా తెరవెనక మాత్రం అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాస్తున్నాడు.
ఇదిలా ఉంటే తెలుగు రీమేక్ కోసం మూడు ప్రధానమైన మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఒకటి ఎమోషనల్ సీక్వెన్స్.. ఒరిజినల్లో లేని కొన్ని ఎమోషనల్ సీన్స్ తెలుగులో చూడబోతున్నాం. అలాగే పవన్, నిత్యా మీనన్ మధ్య రొమాంటిక్ ట్రాక్. మలయాళంలో అలాంటిదేం ఉండదు కానీ తెలుగులో పవన్ ఫ్యాన్స్ కోసం త్రివిక్రమ్ యాడ్ చేస్తున్నాడు.
మూడో ప్రధానమైన మార్పు కామెడీ.. ఒరిజినల్లో సీరియస్ కథ ఇది. కానీ ఇక్కడ బ్రహ్మానందం వచ్చాడు. ఆయన కోసం సపరేట్ కామెడీ ట్రాక్ ఒకటి త్రివిక్రమ్ రాసాడు. మొత్తానికి తెలుగులో భీమ్లా నాయక్ కోసం భారీగానే మార్పులు జరుగుతున్నాయి. మరి ఇది సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి. జనవరి 12న విడుదల కానుంది భీమ్లా నాయక్.