తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాకు ఏడాది చివర్లో వచ్చిన బాక్సాఫీస్ బొనాంజ పుష్ప. ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమా చూపించిన దూకుడు మరిచిపోవడం సాధ్యం కాదు. అల్లు అర్జున్ మార్కెట్ ఏ రేంజ్‌కు పెరిగింది అనేది స్పష్టంగా చూపించింది పుష్ప. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఇంకా సేఫ్ కాలేదు కానీ మిగిలి భాషల్లో మాత్రం బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది.
రెండేళ్ల పాటు కరోనా కష్టాలు కూడా దాటి ఈ సినిమాను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తెరకెక్కించాడు సుకుమార్. పుష్ప ది రైజ్ విజయం తమకెంతో కీలకం అని థ్యాంక్ యూ మీట్లో చెప్పాడు సుకుమార్. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత సుకుమార్ కష్టానికి తగిన ఫలితం దొరికిందని తామంతా సంతోషించామని చెప్పాడు బన్నీ. ఇదిలా ఉంటే తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు సుకుమార్.
పుష్ప పార్ట్1 సినిమా కోసం పని చేసిన లైట్ బాయ్ దగ్గరి నుంచి టెక్నీషియన్ వరకు.. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా తాను లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాడు ఈ దర్శకుడు. సాధారణంగా హీరోలు, నిర్మాతలు ఇలాంటి అనౌన్స్మెంట్ చేస్తుంటారు. తమ సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి బహుమతులు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం చిత్రంగా దర్శకులు ఇలాంటి ప్రకటన చేసి ఆశ్చర్యపరిచాడు.
సుకుమార్ నుంచి ఈ తరహా అనౌన్స్మెంట్ రావడం నిజంగానే అంతా ఆశ్చర్యపోయారు. సుకుమార్ వ్యక్తిగత ఇమేజ్ ఈ ఒక్క మాటతో మరింత పైకి వెళ్లిందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప సినిమా థ్యాంక్ యూ మీట్లో మాట్లాడుతూ.. సుకుమార్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తనకు అల్లు అర్జున్ దేవుడు అని చెప్పుకొచ్చాడు ఈయన.
మరోవైపు సినిమా సాధించిన విజయం చూసిన తర్వాత.. తనను నమ్మి రెండేళ్ల పాటు శ్రమించిన తన టీమ్‌కు లక్ష రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు ఈయన. ఇప్పటి వరకు పూర్తయింది కేవలం మొదటి భాగం మాత్రమే. త్వరలోనే రెండోభాగం మొదలు కానుంది. ఫిబ్రవరిలో మొదలు పెట్టి.. జూన్ వరకు పూర్తి చేయాలని చూస్తున్నాడు.