మహేష్ ఆనంద్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ ఒక్కసారి నెంబర్ 1 సినిమాను గుర్తు చేసుకుంటే అందులో ఈయన యాక్షన్ గుర్తుకు వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రంలో సైకో విలన్ గా నవ్వులతో పాటు నటన కూడా కనబరిచాడు. దాంతోపాటు మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేసాడు మహేష్ ఆనంద్. ఫిబ్రవరి 8న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఈయన. మహేష్ ఆనంద్ వయసు 57 మాత్రమే.
100 సినిమాలకు పైగా తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన కోడి రామకృష్ణ ఫిబ్రవరి 22న మరణించారు. కొన్నేళ్లుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఈయన.. 69 ఏళ్ళ వయసులో చికిత్స పొందుతూ హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్లో కన్నుమూసారు. తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ నేర్పించిన దర్శకుడు ఈయనే.
ఈ ఏడాది అందరికీ షాక్ ఇచ్చిన మరణం విజయనిర్మల. సూపర్ స్టార్ కృష్ణ సతీమణిగానే కాకుండా దర్శక నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది విజయ నిర్మల. ఈమెకు కొన్నేళ్లుగా అనారోగ్యం ఉంది. 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ఏకైక దర్శకురాలు ఈమె. 73 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్లో కన్నుమూసింది విజయ నిర్మల.
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి శ్రీకాంత్ శర్మ. ఈయనతో ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఈయన రచనలు మాత్రం అందరికీ సుపరిచితే. ఎన్నో పుస్తకాలు రాసిన శ్రీకాంత్ శర్మ.. కొన్ని పాటలు కూడా రాసారు. ముఖ్యంగా తనయుడు మోహనకృష్ణ తెరకెక్కించిన సినిమాల్లో శ్రీకాంత్ శర్మ పాటలు చాలా ప్రాచూర్యం పొందాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలి.. నటుడు, దర్శకుడు, నిర్మాత దేవదాస్ కనకాల 74 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కన్నుమూసారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది నటులను పరిచయం చేసిన ఘనత ఈయన సొంతం. రజినీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లకు కూడా నటన నేర్పించాడు దేవదాస్. రెండేళ్ల కింద ఈయన భార్య చనిపోవడంతో అప్పట్నుంచి దేవదాస్ ఆరోగ్యం దెబ్బతింది. ఈ ఏడాది ఆగస్ట్ 2న ఈయన కన్ను మూసారు.
రాజకీయ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు శివ ప్రసాద్ కూడా ఈ ఏడాదే కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన సెప్టెంబర్ 21న చెన్నై అపోలో హాస్పిటల్లో మరణించారు. నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్నెవరూ కొట్లే డైలాగ్తో బాగా ఫేమస్ అయ్యాడు శివప్రసాద్. దాంతో పాటు డేంజర్ సినిమాకు ఉత్తమ విలన్గా నంది అందుకున్నాడు శివ ప్రసాద్.
కొన్నేళ్ళ పాటు తెలుగు ఇండస్ట్రీని తన కామెడీతో ఉర్రూతలూగించిన కమెడియన్ వేణు మాధవ్. కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు దూరమయ్యాడు. అనారోగ్యంతో కూడా బాధ పడుతున్నాడు. అయితే ఉన్నట్లుండి విషమించడంతో సెప్టెంబర్ 25న ఈయన సికింద్రాబాద్ యశోదాలో కన్నుమూసాడు. కేవలం 49 ఏళ్ళ వయసులోనే ఈయన చనిపోవడం ఇండస్ట్రీ వర్గాలను నివ్వెరపరిచింది. దాదాపు 300 సినిమాలకు పైగా నటించాడు వేణు మాధవ్.
తెలుగు సినిమాల్లో చాలా లేటు వయసులో వచ్చి దాదాపు 250 సినిమాలకు పైగా నటించిన గొల్లపూడి మారుతిరావు డిసెంబర్ 12న అనారోగ్యంతో చనిపోయారు. ఈయన మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు. చెన్నైలోని తన స్వగృహంలోనే 80 ఏళ్ళ వయసులో గుండెపోటుతో చనిపోయారు గొల్లపూడి. ఈయన రచనలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త మార్గాన్ని చూపించాయి.