ఏపీలో మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీకి ఎన్ని ఇబ్బందులున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏడాది కాలంగా సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడిపోయే వాళ్ళు నిర్మాతలు. మరీ ముఖ్యంగా ఓ వైపు కరోనా దాడి చేస్తుంటే.. మరోవైపు ఏపీ సిఎం జగన్ కూడా తన నిర్ణయాలతో నిర్మాతలకు నిద్ర లేకుండా చేసారు. కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ రేట్స్ దారుణంగా ఉండటంతో పెద్ద సినిమాలను విడుదల చేయలేదు కూడా.
అయితే ఈ మధ్యే తన నిర్ణయం మార్చుకుని.. పెద్ద సినిమాలకు అనుగుణంగా ఉండేలా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ నిర్ణయం తీసుకున్నారు జగన్. దాంతో నిర్మాతలు ఖుషీ అవుతున్నారు. మొన్న విడుదలైన రాధే శ్యామ్ నుంచే ఈ కొత్త టికెట్ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఏపీ సీఎంను సినీ ప్రముఖులు కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అది కూడా మోహన్ బాబు మొన్నామధ్య చెప్పిన మాటలనే ఇప్పుడు మిగిలిన వాళ్లు ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రులను సన్మానించుకోవాలి.. మన కష్టాలు చెప్పుకోవాలి.. మన ఇబ్బందులు వాళ్లతో కూర్చుని చర్చించాలి.. ఇండస్ట్రీకి ఏది మంచిదో.. ఏది చెడ్డదో వాళ్లకు అర్థమయ్యేలా వివరించాలి.. అవసరమైనవి అడగాలి.. అప్పుడే వాళ్ళు కూడా అర్థం చేసుకుని సాయం చేస్తారు అంటూ ఈ మధ్యే ఓ స్పీచ్‌లో భాగంగా మోహన్ బాబు చెప్పాడు.
అప్పట్లో అవి బాగా వైరల్ అయ్యాయి కూడా. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల సమస్య విషయమై మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేసాడు. అయితే ఇప్పుడు ఈ మాటలనే టాలీవుడ్ ప్రముఖులు నిజం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమ బాధలు అర్థం చేసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలను సవరిస్తూ కొత్త జీవో తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి తమ వంతుగా సన్మానం చేయాలని సినీ ప్రముఖులు భావిస్తున్నారని తెలుస్తుంది.
ఇప్పుడు విడుదల చేసిన జీవోలో చిన్న సినిమాలకు 5వ షో, పెద్ద సినిమాలకు (కండీషన్స్ అప్లై) టికెట్స్ రేటు పెంపు లాంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. సరిగ్గా వాడుకుంటే ఇప్పుడు తీసుకొచ్చిన జీవోతో నిర్మాతలకు చాలా లాభాలు ఉంటాయి. అంటే సినిమా పరిశ్రమకు కూడా చాలా లాభాలుంటాయి. ఒకవేళ చేయాలనుకుంటే ముందుగానే చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ సినిమాను ఇబ్బంది పెట్టాలనే ఇన్నాళ్లు ఇది చేయలేదనే వాదన కూడా ఉంది.