సమంత, నాగ చైతన్య విడిపోయి కూడా రెండు నెలలు దాటిపోయింది. అయినా కూడా ఇప్పటికీ ఈ ఇద్దరి విడాకుల గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎక్కడో ఓ చోట ఈ టాపిక్ నడుస్తూనే ఉంది. విడాకుల తర్వాత చాలా బలహీనంగా మారిపోయానని.. ఓ దశలో చనిపోతానేమో అనిపించిందని.. కానీ ఇప్పుడు తాను ఎంత ధృడంగా ఉన్నానో అర్థమవుతుంది అని చెప్పుకొచ్చింది సమంత. ఈ ఇద్దరూ తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసారు.
ఎన్నో రోజుల సుధీర్ఘ చర్చల తర్వాత తామిద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు సమంత, చైతూ. దయచేసి తాము తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు అర్థం చేసుకుంటారని కోరుకున్నారు ఈ ఇద్దరూ. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్స్తో బిజీ అయిపోయారు. వరస సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత సమంత మీడియా ముందుకొచ్చింది. తన విడాకుల గురించి మాట్లాడింది.
జీవితంలో ప్రతీ ఒక్కరికి మంచి రోజులు వస్తాయి.. అలాగే చెడ్డ రోజులు వస్తాయి. మంచి వచ్చినపుడు ఓకే అని.. చెడును ఒప్పుకోకపోతే లైఫ్ ముందుకు వెళ్లదు. సరే అయిందేదో అయిపోయిందని మిగిలిన జీవితంలో ముందుకెళ్లాలి కానీ అక్కడే ఉండిపోతానంటే కుదరదు అంటుంది సమంత. తన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని.. వ్యక్తిగతంగానూ ఒడిదుడుకులు వచ్చాయని చెప్పుకొచ్చింది.
అయినా కూడా అన్నింటిని దాటుకుని ఈ రోజు ధైర్యంగా నిలబడ్డానని చెప్పింది సమంత. ముఖ్యంగా విడాకుల తర్వాత తను కుంగిపోయి.. చచ్చిపోతానేమో అనే భయం కూడా వేసిందని చెప్పింది స్యామ్. కానీ ఈ రోజు అన్నింటిని తట్టుకుని నిలబడిన తీరు చూసిన తర్వాత.. తన మీదే తనకే గర్వంగా ఉందని చెప్పింది సమంత. తాను ఇంత ధైర్యంగా, ధృడంగా ఎలా ఉండగలిగానో తనకే అర్థం కాలేదని చెప్పుకొచ్చింది స్యామ్.
తాను కెరీర్ మొదలుపెట్టినపుడు చాలా మంది అనుకున్నారని.. జాక్ పాట్ కొట్టింది ఈ అమ్మాయి.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అనే మాటలు చాలానే విన్నానని చెప్పుకొచ్చింది స్యామ్. కళ్లు మూసి తెరిచేలోపు స్టార్ అయిపోయింది.. కష్టపడకుండానే స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది అని చాలా మంది తన గురించి మాట్లాడారని.. అవన్నీ విన్నపుడు చాలా బాధ పడేదాన్ని అంటుంది సమంత.
తనకేం తక్కువ.. కష్టపడకుండానే ఇలా ఎదిగానా.. ఎందుకు తనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారో అని చాలా బాధ పడిపోయేదాన్ని అంటుంది ఈమె. తనకు వచ్చే సినిమా అవకాశాలకు తాను సరిపోననే మాటలు కూడా విన్నానని.. ఆమెకంత సీన్ లేదు.. అనవసరంగా అవకాశాలు ఇస్తున్నారన్న వాళ్లు ఉన్నారని గుర్తు చేసుకుంది సమంత. అయినా కూడా అన్నింటినీ తట్టుకుని నిలబడినట్లు చెప్పింది ఈ భామ.