హాలీవుడ్ సినిమాలే కదా.. మన దగ్గర ఎవరు చూస్తారులే అనుకోవద్దు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఇంగ్లీష్ సినిమాలు ఇండియాలో కూడా రచ్చ చేసాయి. అక్కడి సినిమాలు ఇక్కడ చరిత్ర సృష్టించాయి. ఆ మధ్య కొన్ని సినిమాలు మన తెలుగు సినిమాలకు కూడా పోటీ ఇచ్చాయి. ఇప్పుడు ఎటర్నల్స్ కూడా దివాళికి భారీగా విడుదలవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ఎటర్నల్స్.
ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై 10 మంది సూపర్ హీరోస్ ను చూపించబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎటర్నల్స్ చిత్రం విడుదల కానుంది. మార్వెల్ స్టూడియోస్ ఎటర్నల్స్ సినిమాలో గెమ్మా ఛాన్, రిచర్డ్ మేడెన్, కుమాల్ నాంజాయిని, లియా మేక్ హ్యూజ్, బ్రెయిన్ టైరి హెన్రీ, లరెన్ రిడల్ఫ్, బ్యారీ కాగన్, డాన్ లీ, కిట్ హరింగ్టన్, సల్మా హాయక్, అకాడమీ అవార్డు గ్రహీత ఏంజెలీనా జోలీ నటిస్తున్నారు.
ఈ సినిమాను కెవిన్ ఫీజ్, నెట్ మూరె నిర్మిస్తున్నారు. గతేడాది నోమద్ ల్యాండ్ ఈ సినిమాతో అకాడమీ అవార్డు గెలుచుకున్న క్లో ఝా ఎటర్నల్స్ సినిమాను తెరకెక్కించారు. ఒలంపియా గ్రహం నుంచి వేలాది సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన మరణం లేని ఏలియన్స్ ఈ ఎటర్నల్స్. వీళ్ళనే డేవిఎన్ట్స్ అంటారు. మానవత్వాన్ని కాపాడడమే వీళ్ళ పని.
ఎటర్నల్స్కు ఎన్నో పవర్స్ ఉంటాయి. వాళ్లలో అందరు సూపర్ హీరోలు ఒకే రకమైన శక్తి కలిగి ఉంటారు. అందులో కొంతమంది ఆలోచించే వాళ్ళు.. మరికొంతమంది శక్తివంతులు.. ఇంకొందరు ఫైటర్స్ వుంటారు. కానీ ఈ గ్రూప్‌లో అందరికీ సమానమైన శక్తులు ఉంటాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఎటర్నల్స్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.
అందులో స్టార్ హీరోయిన్ సమంత ఉన్నారు. ఎటర్నల్స్ సినిమా కోసం తాను చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నట్లు తెలిపారు ఈమె. సమంత మాట్లాడుతూ.. ‘మనందరం సూపర్ హీరోలను ఎంతగానో ప్రేమిస్తాం.. ఇప్పుడు మరో కొత్త రూపంలో వాళ్ళంతా మన ముందుకు వస్తున్నారు.. సూపర్ హీరోస్‌ను స్క్రీన్ పై చూడటానికి నేనెంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాను’ అంటూ తెలిపారు.
అలాగే సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సైతం ఎటర్నల్స్ విడుదల కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎటర్నల్స్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నిచోట్ల బుకింగ్స్ చాలా వేగంగా పూర్తవుతున్నాయి. దీన్ని బట్టి ఎటర్నల్స్ సినిమాపై ఇండియాలోనూ భారీ అంచనాలున్నాయనేది స్పష్టమవుతుంది. ఈ దివాళి క్రేజ్ సూపర్ హీరోస్ మరింత పెంచేస్తున్నారు.