బిగ్ బాస్ 5 తెలుగులో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. వాటిని చూసిన తర్వాత వామ్మో ఏంటో ఈ సిత్రాలు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా శని, ఆదివారాలు అయితే ఆ సిత్రాల లెక్క మరోలా ఉంటుంది. ఎందుకంటే నాగార్జున వస్తాడు కదా.. అప్పుడు ఇంటి సభ్యులతో అదిరిపోయే మీటింగ్ ఒకటి జరుగుతుంది.. రియాక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్లో షణ్ముఖ్ బాగా హైలైట్ అయ్యాడు. ఇంటికి వచ్చిన కొత్తలో కొన్ని రోజుల పాటు అసలు ఈయన ఇంట్లో ఉన్నాడా లేదా అనేది అర్థం కాలేదు. మూడు నాలుగు వారాలు అయితే నామినేషన్స్‌లోకి కూడా రాలేదు షణ్ణు. నామినేట్ చేయాలంటే ఇంట్లో ఎవరితో అయినా ఇష్యూ ఉండాలి లేదంటే గొడవైనా పడాలి. కానీ ఈ రెండింటికి చాలా దూరంలో ఉన్నాడు షణ్ముఖ్.
కొన్ని రోజుల పాటు తన సామ్రాజ్యంలోనే ఉన్నాడు. ఇప్పటికీ అదే కంఫర్ట్ జోన్లో ఉంటున్నాడు ఈయన. తన స్నేహితులు సిరి, జెస్సీతో కాకుండా మూడో వ్యక్తితో సరిగ్గా కూర్చుంటే ఒట్టు. అలా సాగిపోతుంది షణ్ముఖ్ జస్వంత్. ఈ మధ్యే మెల్లగా ఓపెన్ అవుతున్నాడు ఈ కుర్రాడు. టాస్కులు బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. అలాగే ఈ వారం ఇంటి కెప్టెన్ కూడా అయ్యాడు.