పునీత్ మరణవార్త విన్న వెంటనే దాదాపు 6 గురు అభిమానులు కన్నుమూసారంటే.. అతడి స్థాయి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఓ ప్రభుత్వం చేసే పనులు ఒంటరిగా చేసి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు పునీత్ రాజ్‌కుమార్. ఈయన్ని కడసారి చూడ్డానికి ఏకంగా 11 లక్షల మంది హాజరయ్యారంటే జనసందోహం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది.
అంతేకాదు.. కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివ దేహం ఉంచితే.. ఆయన్ని దర్శించుకోడానికి చెప్పులు వదిలేసి లోపలికి వచ్చారు అభిమానులు. గంటల పాటు అలాగే నిలబడ్డారు. ఆ చెప్పులు అక్కడే వదిలేసి.. ఖాళీ కాళ్ళతో వెళ్లిపోయారు. దాన్ని బట్టి పునీత్‌ను వాళ్లెంతగా గుండెల్లో పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఆయన మరణం తర్వాత సినీ ప్రముఖులు వరసగా శివరాజ్ కుమార్ ఇంటికి క్యూ కడుతున్నారు.
ఆయన్ని కలిసి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ చనిపోయినపుడు చిరంజీవి, శ్రీకాంత్, బాలయ్య, వెంకటేష్ సహా చాలా మంది ప్రముఖులు బెంగళూరు వెళ్లి కడసారి చూసొచ్చారు. అయితే అక్కడున్న జనాన్ని తట్టుకోలేక వెళ్లాలనుకున్న వాళ్లు చాలా మంది భయపడి ఆగిపోయారు. వాళ్లు ఇప్పుడు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెంగళూరు వెళ్లాడు. శివన్న ఇంటికి వెళ్లి పునీత్ మరణంపై ఆరా తీసి.. సంతాపం వ్యక్తం చేసాడు. ఆయన మరణం కేవలం కన్నడ సినిమాకు మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాకు తీరనిలోటు అంటూ చెప్పుకొచ్చాడు చరణ్. చిన్నప్పటి నుంచి తనకు రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.