ఆల్రెడీ నచ్చిన వాళ్లు ఇచ్చే ప్రశంసల కంటే.. తిట్టిన వాళ్ల నుంచి వచ్చే పొగడ్తలు మామూలు కిక్ ఇవ్వవు. ఈయనకు నటన రాదు.. మొహంలో ఎక్స్ప్రెషన్ పలకలేదు.. అనవసరంగా సినిమా చేసి చెడగొట్టాడు.. సరిగ్గా 8 ఏళ్ళ కింద రామ్ చరణ్ గురించి బాలీవుడ్లో వచ్చిన విమర్శలు ఇవి. జంజీర్ సినిమా చేసినపుడు మామూలుగా విమర్శించలేదు రామ్ చరణ్‌ను. ఎందుకు చేసాడ్రా బాబూ ఈ సినిమా అంటూ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యేలా రామ్ చరణ్ ట్రోల్ అయిపోయాడు ఆ సినిమాతో.
అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ నటుడి సినిమాను రీమేక్ చేసి సరిదిద్దుకోలేని తప్పు చేసాడు చరణ్. ఇదే విషయాన్ని మెగా వారసుడు కూడా ఒప్పుకున్నాడు. ఒరిజినల్ కథతో వెళ్లినా బాగుండేది.. అనవసరంగా జంజీర్ లాంటి సబ్జెక్ట్ తీసుకుని తప్పు చేసానంటూ తర్వాత ఇంటర్వ్యూలలో చెప్పాడు చరణ్. అయితే అప్పుడు కేవలం సినిమాను మాత్రమే విమర్శించకుండా.. రామ్ చరణ్‌ను కూడా దారుణంగా విమర్శించారు బాలీవుడ్ క్రిటిక్స్.
అసలు నటన రాదు.. చిరంజీవి కొడుకు అయినంత మాత్రానా హీరో అయిపోతాడా.. ఫేస్‌లో ఒక్కటంటే ఒక్కటైనా ఎక్స్ప్రెషన్ పలుకుతుందా.. సౌత్ వాళ్లు ఎలా భరిస్తున్నార్రా బాబూ అంటూ దారుణంగా ఆడుకున్నారు క్రిటిక్స్. అయితే ఇప్పుడు పోగొట్టుకున్న చోటే మళ్లీ వెతుక్కున్నాడు రామ్ చరణ్. తనను ఎవరెవరైతే విమర్శించారో.. వాళ్లతోనే గొప్ప నటుడు అనిపించుకున్నాడు.
బాలీవుడ్ క్రిటిక్స్ అంతా ట్రిపుల్ ఆర్ సినిమాకు అదిరిపోయే రేటింగ్ ఇచ్చారు. దాంతో పాటు ఎన్టీఆర్, చరణ్ నటన గురించి కూడా పొగిడేసారు. తారక్ కంటే చరణ్ అక్కడి వాళ్లకు బాగా పరిచయం. అది కూడా జంజీర్ పుణ్యమే. అయితే అప్పుడు విమర్శించిన నోళ్ళే ఇప్పుడు ప్రశంసించాయి. జంజీర్‌కు ఇప్పటికీ రామ్ చరణ్ నటనలో చాలా మార్పు వచ్చిందని.. సినిమాకు ఆయన నటన హైలైట్ అంటూ పొగిడేసారు.