తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు లాంటి లెజెండ్ వచ్చిన కుటుంబం అది. ఆయన తర్వాత వారసులు కూడా ఇండస్ట్రీకి వచ్చారు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు కూడా సినిమాలు చేస్తున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నారు.
ఎప్పుడూ ఏదో విషయంపై వార్తల్లో నిలబడుతూనే ఉంటుంది మంచు వారి కుటుంబం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చాడు మంచు విష్ణు. ఇందులో చాలా విషయాల గురించి చెప్పుకొచ్చాడు విష్ణు. ముఖ్యంగా పర్సనల్ విషయాలు కూడా తెలిపాడు. యూ ట్యూబ్లో ఈ ఎపిసోడ్ ట్రెండ్ అవుతుంది. అందులో చాలా విషయాల గురించి చర్చించారు విష్ణు, అలీ.
ముఖ్యంగా వ్యక్తిగత విషయాల గురించి కూడా అడిగాడు. అందులో భాగంగానే తమ్ముడు మనోజ్ గురించి కూడా విష్ణుతో చర్చించాడు ఈ కమెడియన్. మంచు వారి కుటుంబంతో అలీకి మంచి స్నేహం ఉంది. మోహన్ బాబుతో కూడా అలీకి అద్భుతమైన రిలేషన్ ఉంది. దాంతో విష్ణు వాళ్ళను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అలీ. దాంతో మనసులో ఉన్న ప్రశ్నలు మొహమాటం లేకుండా అడిగేసాడు అలీ.
ఈ నేపథ్యంలోనే మనోజ్, విష్ణు మధ్య గొడవలున్నాయంటూ వస్తున్న వార్తలను కూడా అడిగేసాడు. బయట నీకు, మీ తమ్ముడికి గొడవలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.. అందులో నిజమెంత అంటూ నేరుగా విష్ణునే ప్రశ్నించాడు కమెడియన్ అలీ. దీనికి మంచు విష్ణు సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. వేసుకున్న కోటు కూడా విప్పేస్తూ పర్సనల్ విషయాలు వాళ్లకెందుకు అంటూ చెప్పేసాడు విష్ణు.
తమ్ముడితో నీకు గొడవలున్నాయా అంటే అలాంటిదేం లేదని చెప్పాడు విష్ణు. అక్క లక్ష్మి వేరుగా ఉంటుంది.. అలాగే తమ్ముడు మనోజ్ కూడా వేరుగానే ఉంటాడు. నేను నాన్నతో ఉంటున్నా.. అంతే తప్ప అడ్డమైన పుకార్లకి సమాధానం చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చాడు విష్ణు. తమ మధ్య ఏదో ఉందని అనుకునే వాళ్లకు అనవసరంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు విష్ణు.