నేచురల్ స్టార్ నాని కాస్తా ఇప్పుడు ఓటిటి స్టార్ అయిపోతున్నాడు. గతేడాది దిల్ రాజు ఈయన నటించిన 25వ సినిమా ‘వి’ తీసుకెళ్లి అమెజాన్ చేతుల్లో పెట్టాడు. అప్పుడు ఆ సినిమాకు దారుణమైన ఫలితం వచ్చింది. సినిమా హిట్టు ఫ్లాప్ అనేది పక్కనబెడితే అసలు టాక్ తేడాగా వచ్చింది. ఇలాంటి సినిమా తీసాడేంటి అంటూ నానికి డై హార్డ్ ఫ్యాన్స్ కూడా విమర్శించారు.
ఇదిలా ఉంటే నెక్ట్స్ టైమ్ కచ్చితంగా థియేటర్స్‌లోనే కలుద్దాం.. కుమ్మేద్దాం అంటూ చెప్పాడు నాని. కానీ ఇప్పుడు ఈయన నటించిన టక్ జగదీష్ సినిమాను కూడా మళ్లీ ఓటిటిలోనే విడుదల చేయబోతున్నారు. దీనిపై ఎగ్జిబిటర్స్ మండి పడుతున్నారు.. డిస్ట్రిబ్యూటర్స్ తల పట్టుకుంటున్నారు. నిర్మాతలు మాత్రం తమ నిర్ణయం తీసుకున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. టక్ జగదీష్ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. దాదాపు 40 కోట్లకు పైగానే ఈ సినిమా డీల్ క్లోజ్ అయిపోయింది. అయితే అదే రోజు లవ్ స్టోరీ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడానికి నిర్మాత సునీల్ నారంగ్ సిద్ధమయ్యాడు.
దాంతో టక్ జగదీష్ Vs లవ్ స్టోరీ అయిపోయింది పరిస్థితి. దానికంటే కూడా ఓటిటి Vs థియేటర్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. దీన్ని కొందరు ఎగ్జిబిటర్స్ మరీ పర్సనల్‌గా తీసుకుని నానిని టార్గెట్ చేసారు. సినిమాల్లోనే నాని హీరో.. బయట జీరో.. పిరికివాడు అంటూ ఫైర్ అవుతున్నారు. థియేటర్లో కనిపించిన వాడినే హీరో అంటారు కానీ ఓటిటిలో కనిపించేవాడు కాదు హీరో అంటూ విమర్శిస్తున్నారు.
నాని డబ్బులకు ఆశ పడి తన సినిమాలను ఓటిటిలో ఇచ్చేస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. అది పూర్తిగా నిర్మాత నిర్ణయం.. తన చేతుల్లో ఏం లేదు అంటూ నాని చెప్తున్నా కూడా ఎగ్జిబిటర్స్ మాత్రం వినడం లేదు. నాని నిర్మాతలతో మాట్లాడితే పని జరుగుతుంది కానీ ఆయన కావాలనే సైలెంట్ అయిపోయాడు అంటూ విమర్శిస్తున్నారు. మరి దీనిపై నాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.