సూపర్ స్టార్ కృష్ణ (79) ఇకలేరు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగ్గా స్పందించలేదు. కృష్ణ ఆరోగ్య విషమంగానే ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. అంతలోనే ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. Photo : Twitter
కృష్ణ 1943, మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు.. 1960లో ఏలూరు సి.ఆర్.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు. కృష్ణ చూసిన తొలి చిత్రం 'పాతాళభైరవి'. బాగా ఆకట్టుకున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌కి అభిమాని అయ్యారు. 'దేవదాసు' వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలికి వచ్చిన ఏఎన్నార్, సావిత్రిలను చూడడానికి వేల మంది జనం రావడంతో.. ఒక హీరోను ఇంతగా అభిమానిస్తారా ? అని ఆశ్చర్య పోయారు. హీరోగా మారాలనే ఆలోచనకు నాంది పలికింది ఈ సంఘటనే. (File/Photo)
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలో రాణించాలంటే నాటకాల్లో ఫ్రూవ్ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. 1960లో కృష్ణ తొలిసారిగా స్టేజ్ మీద 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం.ఆ తర్వాత 'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్' వంటి నాటకాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. కృష్ణ తొలిసారి హీరోగా ఎంపికైన చిత్రం 'కొడుకులు కోడళ్ళు'. కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది. 'మూగ మనసులు' చిత్రం విడుదలైన తర్వాత 'తేనె మనసులు' కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్ యాడ్ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు. హీరోగా ఎంపికైనప్పటికీ బక్కగా ఉన్నావు, నువ్వేం నటిస్తావని చాలా మంది దెప్పిపోడిచారట. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు జడ్జ్మెంట్ తప్పన్నారు. (Twitter/Photo)
1968 నుంచి 74 వరకు ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఆ టైమ్‌లో తెనాలిలో ఉన్న ఏడు థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవంటే అతిశయోక్తి కాదు. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన ఘనత కృష్ణదే. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు ముద్దుగా 'సూపర్‌స్టార్' అని పిలుచుకుంటారు. 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ. ఈ రోజుల్లో మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కృష్ణ గారు కూడా. ఎందుకంటే ఆయన చేసిన ప్రయోగాలు.. సాహసాలు మరే హీరో చేయలేదేమో..? అందుకే సాహసమే ఆయన ఊపిరి అంటారు (Twitter/Photo)
తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబారు చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ఓ.ఆర్.డబ్ల్యు రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (తెలుగు వీర లేవరా..).. తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. (Twitter/Photo)
ముఖ్యంగా తెలుగు సినిమా ఎదగడానికి తన వంతుగా ఎన్నో ప్రయత్నాలు చేసారు కృష్ణ. ఇతర హీరోలతో పోలిస్తే సాంకేతికంగా చాలా అడ్వాన్స్ సినిమాలు చేసారు ఈయన. తెలుగు తెరపై తొలి స్కోప్ సినిమా.. తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా.. తొలి డీటీఎస్ సినిమా.. తొలి 70ఎంఎం సినిమా.. తొలి కౌబోయ్ సినిమా.. తొలి స్పై సినిమాని చేసింది ఆయనే. (Twitter/Photo)
తొలి 70 ఎంఎం సినిమా: సింహాసనం (1986). ఈ సినిమా కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. ఇప్పట్లో ఈ సినిమాను తెరకెక్కించాలంటే దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని పలు సందర్భాల్లో కృష్ణ వెల్లడించారు. తెలుగులో తొలి 70MM, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సినిమా ’సింహాసనం’ ను అందించిన ఘనత కృష్ణ దే. ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్న సూపర్ స్టార్ కృష్ణ. (Twitter/Photo)
తొలి సోషల్ కలర్ సినిమా: తేనె మనసులు . ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా హీరోగా కృష్ణకు తొలి సినిమా(1965). ఈ సినిమా పలు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. తొలి పూజీ కలర్ సినిమా: భలే దొంగలు (1976). కే.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా కూడా తొలి ఫూజీ కలర్ మూవీగా రికార్డులుకు ఎక్కింది. (Twitter/Photo)
తొలి ORW కలర్ సినిమా: గూడుపుఠానీ (1972). థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి తరం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తొలి RO సినిమా: కొల్లేటీ కాపురం (1976). ఈ సినిమా కూడా అప్పట్లో పలు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. తొలి ఔట్ డోర్ షూటింగ్ సినిమా, తొలి స్కోప్ టెక్నోవిజన్ సినిమా: సాక్షి (1967). బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. (Twitter/Photo)
తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా: ఈనాడు (1982). ఈ సినిమా . పర్వతనేని సాంబశివరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. అప్పటికే నంబర్ వన్ హీరోగా ఉన్న కృష్ణ ఈ సినిమాలో హీరోయిన్గా లేకుండా నటించడం అనేది ఒక సాహసం. తొలి డిటిఎస్ సినిమా: తెలుగు వీర లేవరా (1995). తెలుగు వీర లేవర సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ను ఇవివి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. (Twitter/Photo)
తొలి స్పై సినిమా: గూఢచారి 116 (1966). మల్లికార్జున రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ‘డాక్టర్ నో’, ఫ్రమ్ రష్యా విత్ లవ్’ సినిమాలను స్పూర్తిగా తీసుకొని తెరకెక్కించారు. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ సొంతం. 1972లో ఈయన 18 సినిమాల్లో నటించాడు. దానికి ముందు 1971లో 11, 1970లో 16 సినిమాలు విడుదల చేసాడు. (Twitter/Photo)
1983లో ఒకే నెలలో తక్కువ వ్యవధిలోనే విడుదలైన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. 4 సెంటర్లలో నేరుగా శతదినోత్సవం జరుపుకున్నాయి. సెప్టెంబర్ 1983లో శక్తి, ప్రజారాజ్యం సినిమాలు ఈ రికార్డులు తిరగరాసాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు ఏ హీరోకు కూడా సాధ్యం కాలేదు. అంతేకాదు ఒకేరోజు ‘ఇద్దరు దొంగలు’, యుద్దం వంటి సినిమాలను రిలీజ్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకు దక్కుతుంది. (Twitter/Photo)
కృష్ణ దాదాపు 80మందికిపైగా హీరోయిన్లతో నటించారు. వారిలో ఎక్కువగా నటించింది మాత్రం విజయనిర్మల. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 48 సినిమాలొచ్చాయి. ఆ తర్వాత జయప్రదతో 47 చిత్రాల్లో, శ్రీదేవితో 31 చిత్రాల్లో, రాధతో 23 చిత్రాల్లో నటించారు. 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు. తొమ్మిదేళ్ళలో 100 సినిమాల్లో నటించిన ఎవర్గ్రీన్ రికార్డూ కృష్ణకే సొంతం. నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను నిర్మించారు. అలాగే 12కి పైగా చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. (Twitter/Photo)
'సింహాసనం' చిత్రంతో దర్శకుడిగా మారారు కృష్ణ. సూపర్ స్టార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం హిందీలో కూడా ఏకకాలంలో విడుదలై రెండు భాషల్లోనూ రికార్డు విజయం సాధించింది.ఆ తర్వాత ఈయన స్వీయ దర్శకత్వంలో 'కళియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు', 'కొడుకు దిద్దిన కాపురం', 'రిక్షావాలా', 'అన్నాతమ్ముడు', 'నాగాస్త్రం', 'ఇంద్ర భవనం', 'రక్త తర్పనం', 'అల్లుడు దిద్దిన కాపురం' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. (File/Photo)
57 ఏండ్ల కెరీర్లో 350కిపైగా చిత్రాల్లో నటించిన కృష్ణ.. 'గూఢచారి 116', 'సాక్షి', 'మోసగాళ్లకు మోసగాడు', 'పండంటికాపురం', 'దేవుడు చేసిన మనుషులు', 'అల్లూరి సీతారామరాజు', 'దేవదాసు', 'కురుక్షేత్రం', 'భలే దొంగలు', 'మనస్సాక్షి', 'ఈనాడు', 'సింహాసనం', 'ముద్దు బిడ్డ', 'నంబర్ 1' వంటి చిత్రాలు కృష్ణలోని నటనకు ప్రతిబింబాలు. ఈ చిత్రాలు ఆయనకు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. 'సాక్షి' వంటి పలు సినిమాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. ఆయన నటించిన వాటిలో పౌరాణికాలు, జానపదాలు, చారిత్రక నేపథ్యాలు, ప్రేమకథలు, ఫ్యామిలీ చిత్రాలు చేసినప్పటికీ అన్నింటిలోనూ కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తపడ్డారు. (Twitter/Photo)
కృష్ణ 19వ ఏట అంటే 1962లో ఇందిరాదేవిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని జన్మించారు. రమేష్ బాబు తొలుత నటుడిగా రాణించి ఆ తర్వాత నిర్మాతగా మారారు. అలాగే మంజుల కూడా నటిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. మహేష్‌బాబు అగ్ర హీరోగా రాణిస్తున్న విషయం విదితమే. 1969లో 'సాక్షి' సినిమా ద్వారా పరిచయమైన కథానాయిక విజయనిర్మలను వివాహమాడారు. (Twitter/Photo)
2008లో ఆంధ్రయూనివర్సిటీ 'గౌరవ డాక్టరేట్'తో ఆయన్ని ఘనంగా సత్కరించింది. భారతీయ సినిమాకు చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2009లో పద్మభూషణ్ పురస్కారంతో కృష్ణను సముచితంగా గౌరవించింది. అలాగే 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఫిల్మ్ ఫేర్ లైఫ్ ఎఛీవ్మెంట్ పురస్కారం సైతం కృష్ణని వరించింది. దక్షిణాదిన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 1997వ సంవత్సరానికి ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డునూ ఆయన సొంతం చేసుకున్నారు. తొలినాళ్ళలో ఆయన నటించిన 'సాక్షి' చిత్రం 1968లో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిత మైంది. (Twitter/Photo)
1972లో ఆయన నటించిన 'పండంటి కాపురం' చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకుంది. కృష్ణకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. రాజీవ్ గాంధీ ఒత్తిడి మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో ఏలూరు నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచారు. రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. (Twitter/Photo)
ఇన్నేళ్ళ సినీ ప్రస్థానంలో కృష్ణ అన్ని రకాల పాత్రలను పోషించారు. ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్నది ఆయన కోరిక. కానీ చంద్రహాస్ సినిమాలో శివాజీ పాత్రను పోషించారు. మరోవైపు ‘యాక్టర్ సినీ యాక్టర్’, భారత సింహం’ వంటి సినిమాల్లో పాటలో భాగంగా ఛత్రపతి పాత్రలో అలరించారు కృష్ణ. (File/Photo)