ఈ ఎపిసోడ్లో సీనియర్ జర్నలిస్ట్, బ్లడ్ సాండర్స్ రచయిత సుధాకర్ రెడ్డి ఉడుముల కూడా ఉన్నారు. దుబాయ్‌లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్‌కు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఎపిసోడ్‌ను రూపొందించారు. వెబ్ సిరీస్‌లో హమీద్, సుధాకర్ రెడ్డి పాత్రలు, ఇతర వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
ఏప్రిల్ 3న ప్రసారం అవుతున్న ఎపిసోడ్ : ప్రీమియర్స్ లిగ్నెస్ అనేది ప్యారిస్‌లో ఉన్న ఒక స్వతంత్ర నిర్మాణ సంస్థ, ప్రెస్ ఏజెన్సీ. వెబ్ సిరీస్‌కు హ్యూగో వాన్ ఆఫెల్ దర్శకత్వం వహించారు. ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీ సిరీస్‌లో ఎన్విరాన్మెంటల్ క్రిమినల్స్‌ని పట్టుకునే మార్టిన్ బౌడోట్నే ఈ సిరీస్‌కి నిర్మాత. ఏప్రిల్ 3న రాత్రి 9:00 గంటలకు, 9:50 గంటలకు రెండు డాక్యుమెంటరీలు, ది గాడ్‌ఫాదర్ ఆఫ్ ది ఓషన్స్, ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ది ఫారెస్ట్లు ఫ్రాన్స్ 5లో ప్రసారం అవుతాయి. france.tvలో రీప్లే కోసం అందుబాటులో ఉంటాయి.
సుధాకర్ రెడ్డి ఉడుముల న్యూస్ 18తో మాట్లాడుతూ..‘ఈ ఎపిసోడ్ ఇన్వెస్టిగేటివ్ వర్క్, నా పుస్తకం బ్లడ్ సాండర్స్ కోసం నేను చేసిన పనికి కొనసాగింపు. ఎర్రచందనం ఆంధ్రకు విలువైనది. మనం మేల్కొని దానిని రక్షించే సమయం ఇది. స్మగ్లర్లలో షాహుల్ హమీద్ అగ్రగామి. అతనిలాంటి వారు ఇంకా చురుగ్గా ఉన్నారు.’ అని చెప్పారు.
ఎర్ర చందనం అరుదైన సంపద : ఫిల్మ్ డైరెక్టర్ హ్యూగో వాన్ ఆఫెల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంటర్‌పోల్ రెడ్ లిస్ట్‌లో ఉన్న అగ్రశ్రేణి ఎన్విరాన్మెంటల్ క్రిమినల్స్‌ని మేము గుర్తించాం. ఎర్రచందనం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ కొండల అడవుల్లో లభిస్తుంది. ఇది అరుదైనది, ఖరీదైనది. ఈ కలపతో తయారు చేసిన ఫర్నిచర్‌కు చైనా, జపాన్‌లో చాలా డిమాండ్ ఉంది. ఈ ఎపిసోడ్ చేయడానికి, ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రికలో పనిచేస్తున్న భారతీయ పరిశోధనాత్మక జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములతో కలిసి పనిచేసే అవకాశం మాకు లభించింది. ఆయన 'బ్లడ్ సాండర్స్ ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్' అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం కూడా చాలా ఉపయోగపడింది. ది ఎగ్జిక్యూషనర్ ఆఫ్ ఫారెస్ట్‌లో, సుధాకర్ రెడ్డి ఉడుముల కథ కూడా ఉంటుంది’ అని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్‌లోని లెవ్త్వైట్: ది వైట్ విడో ఎపిసోడ్‌కు హ్యూగో వాన్ ఆఫెల్ దర్శకుడు.
తమిళనాడుకు చెందిన హమీద్ : తమిళనాడులోని అభిరామానికి చెందిన షేక్ దావూద్ షాహుల్ హమీద్‌ను ఏపీ పోలీసులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెతుకుతున్నాయి. హమీద్ తమిళం, ఉర్దూ, అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడగలడని ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులో పేర్కొన్నారు. , , , చెన్నై, శేషాచలం అడవులు, సింగపూర్, దుబాయ్‌లలో షాహుల్ హమీద్‌పై ఎపిసోడ్ చిత్రీకరించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుములతోపాటు పలువురు మాజీ పోలీసు అధికారులు, DRI అధికారులు, ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు.
స్మగ్లింగ్ చీకటి కోణాలు తెలుస్తాయి! : ఫ్రాన్స్ 5 TV ప్రకారం.. ప్రపంచంలో కేవలం ఆగ్నేయ భారతదేశంలోని శేషాచలం అడవుల్లోనే ఎర్ర చందనం పెరుగుతుంది. స్మగ్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్మగ్లర్లు ఇప్పటికే 95% జాతులను నాశనం చేశారు. ఇలాంటి చర్చల్లో ప్రధానంగా వినిపించే పేరు సాహుల్ హమీద్. అతన్ని గాడ్ ఫాదర్ ఆఫ్ ట్రాఫిక్‌గా పేర్కొంటారు. ఇంటర్‌పోల్ 2016 నుంచి ఈ భారతీయ నేరస్థుడిని వెతుకుతోంది.
ఇప్పటికే సాహుల్ హమీద్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అతడు ఆస్తులు కూడా భారీగా సంపాదించుకున్నాడు. ఎన్నో నేరారోపణలు అతడిపై ఉన్నాయి. ఇతని సంపద 120 మిలియన్ డాలర్లుగా అంచనా. ఇండియన్ పోలీసులు మొదటిసారి అరెస్టు చేసిన తర్వాత, సాహుల్ హమీద్ దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచే నేర కార్యకలాపాలు కొనసాగించాడు. భారతీయ అడవుల నుంచి దుబాయ్ మీదుగా సింగపూర్ నౌకాశ్రయం వరకు, అతను చేసిన స్మగ్లింగ్.. ఫాంటమ్ కంపెనీలు, అవినీతి కస్టమ్స్ అధికారులు, ప్రభుత్వ సహకారం, అంతర్జాతీయ కలప వ్యాపారం రహస్యాలను వెల్లడిస్తుంది.
సుధాకర్ రెడ్డి ఉడుముల పాత్ర ఏంటి? : సుధాకర్ రెడ్డి ఉడుముల ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్. తన జర్నలిజం కెరీర్లో 25 సంవత్సరాల కాలంలో సుధాకర్ ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డ్‌లో, డెక్కన్ క్రానికల్‌లో సిటీ ఎడిటర్, బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో చెవెనింగ్ ఫెలోషిప్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఆయన రాసిన బ్లడ్ సాండర్స్ పుస్తకం.. అల్లు అర్జున్, సుకుమార్ మూవీ పుష్ప అసలు కథ. సుధాకర్ న్యూస్ ఇనిషియేటివ్ ఇండియా ట్రైనింగ్ నెట్‌వర్క్‌తో ఫాక్ట్ చెక్ ట్రైనర్. అతను ఫాక్ట్ చెక్ చేయడం ఎలా అనే పేరుతో తెలుగులో వచ్చిన వెరిఫికేషన్ మాన్యువల్‌కు సహ రచయితగా ఉన్నారు. ఆయన అనేక మంది జర్నలిస్టులకు మార్గనిర్దేశం చేశారు. యునిసెఫ్ మీడియా అవార్డు గ్రహీత, మైక్రోబయాలజిస్ట్, లాయర్ , ఆయన ఖాతాలో ఇలాంటి విజయాలు చాలా ఉన్నాయి.