Taraka Ratna: నందమూరి కుటుంబం నుంచి ఒక్క విజయం కూడా అందుకోని ఏకైక హీరో తారకరత్న. నందమూరి మోహన కృష్ణ తనయుడే ఈయన. తాజాగా ఈయన లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోగా ఈయన పేరు మీద ఓ ప్రపంచ రికార్డు ఉంది.
నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ స్టార్స్‌గా నిలిచింది.. ఎదిగింది ఇద్దరే. ఒకరు బాలయ్య.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు. అయితే మరో హీరో కూడా నందమూరి కుటుంబం నుంచి వచ్చాడు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. అతడే తారకరత్న.. నందమూరి మోహన కృష్ణ తనయుడే ఈయన.
ప్రేక్షకులకు తారకరత్న అనే హీరో ఉన్నాడనే సంగతే గుర్తు లేదు. అయితే ఈ హీరోకు మాత్రం ఓ వరల్డ్ రికార్డు ఉంది. ఇండస్ట్రీకి ఎవరైనా ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. లేదంటే రెండు సినిమాలతో వస్తారు. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన హీరో నందమూరి తారకరత్న. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. ఒకటి రెండు కాదు ఏకంగా 9 సినిమాలు ఒకే రోజు మొదలయ్యాయి. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ అది వరల్డ్ రికార్డే.
ఎందుకంటే హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ తారకరత్న విషయంలో ఇదే జరిగింది. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చాడు తారక్. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అందులో చాలా వరకు విడుదల కాలేదు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు.. అగ్ర దర్శకులతో కూడా మొదలుపెట్టాడు తారకరత్న. కానీ ఎందుకో అవి తర్వాత మెటిరియలైజ్ కాలేదు. కేవలం ముహూర్తంతోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పుడు మొదలుపెట్టిన సినిమాలలోనే ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.