తమిళ హీరోలకు తెలుగు మార్కెట్ కావాలి. ఇక్కడ్నుంచి వచ్చే డబ్బులు కావాలి.. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచులు మాత్రం అవసరం లేదు. ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఓ తమిళ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారంటే కనీసం టైటిల్ అయినా సరిగ్గా ఉండాలి. లేకపోతే ఆ సినిమాను ఎందుకు చూడాలి అనే ఓ ప్రశ్న ప్రేక్షకుడిలో వస్తుంది. టైటిల్ విషయంలో కూడా జాగ్రత్త పడకుండా సినిమాను తీసుకొస్తే అంతకంటే దారుణం మరోటి ఉండదు.
ఇప్పుడు అజిత్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఆయనకు తెలిసి జరుగుతుందో లేదంటే అలా వదిలేస్తున్నారో తెలియదు కానీ ఆయన నటిస్తున్న వలిమై సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. జనవరి 13న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. వలిమై సినిమాను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు.
అజిత్‌కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి విడుదల చేస్తే తప్పేం లేదు కదా అనుకుంటున్నారా..? అవును.. కానీ ఓ సినిమాను విడుదల చేస్తున్నపుడు టైటిల్ చూసుకోవాలి కదా అనేది కామన్ ఆడియన్ ప్రశ్న. తమిళ టైటిల్‌నే తెలుగులోనూ పెడితే ఏంటి అర్థం.. అసలు ఆ టైటిల్ అర్థం ఎంతమందికి తెలుస్తుంది..? అజిత్ సినిమాను వలిమై పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను సిహెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నాడు.
వలిమై అంటే తమిళంలో బలం అని అర్థం. కనీసం అదే టైటిల్ అయినా తెలుగులో పెట్టుంటే బాగుండు అంటున్నారు అభిమానులు. బలం అంటే బాగానే ఉంది కదా.. అదే పెట్టొచ్చు కదా అంటున్నారు. అంతేకానీ తమిళంలో వలిమై ఉందని.. తెలుగులోనూ అదే టైటిల్ పెడితే అంతకంటే కామెడీ మరోటి లేదు. ఎంత అజిత్ స్టార్ హీరో అయినా కూడా కనీసం తెలుగులో సినిమాలు విడుదల చేసేటప్పుడు టైటిల్స్ చూసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.
గతంలో మోహన్ లాల్ కూడా ఓ సినిమా విషయంలో ఒడియన్ అని అలాగే పెట్టేసాడు. దానికి ముందు విజయ్ కూడా ఒకట్రెండు సినిమాలకు తమిళ సినిమా టైటిల్స్ నేరుగా తెలుగులో పెట్టడానికి చూసినా.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నాడు. అలా చేస్తే కనీసం టైటిల్స్ కూడా తెలుగు ప్రేక్షకులకు అర్థం కావు. అంటే అర్థం కాని సినిమా కోసం థియేటర్‌కు ప్రేక్షకుడు ఎందుకు రావాలనే ప్రశ్న మొదలవుతుంది..?
అలాంటిది ఇప్పుడు అజిత్ అయితే ఏకంగా వలిమై అంటూ వచ్చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాకు తెలుగులో బలం అనే టైటిల్ అనుకున్నారు కానీ ఎందుకో మరో ఒరిజినల్ టైటిల్‌తో వచ్చేస్తున్నారు. ఇదివరకు తన సినిమాలకు తెలుగులో ఎంతవాడు గానీ, వీరుడొక్కడే, ఆట ఆరంభం, విశ్వాసం ఇలా మంచి టైటిల్స్‌తోనే వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం వలిమై అంటూ వస్తున్నాడు.