దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు అభిమానులు. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈయన సంస్మరణ సభ బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగింది. దీనికి అతిరథ మహారథులంతా హాజరయ్యారు. సినీ రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు.. దేశంలోని ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై పునీత్ చేసిన సేవల గురించి కొనియాడారు.
అతడితో తమకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఇదివరకు పునీత్ నటించిన చాలా సినిమాలకు సంబంధించిన వేడుకలు జరిగిన బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లోనే ఈ రోజు ఆయన శ్రద్ధాంజలి సభ జరగడం అక్కడున్న వాళ్ళనే కాదు.. కోట్లాది మంది కన్నడిగుల గుండెలను తడిపేసింది. అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక కర్ణాకటలో 21 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.
నాడు మహాత్మాగాంధీ అంత్యక్రియలకు 20 లక్షల మంది హాజరైతే.. మొన్న పునీత్ అంత్యక్రియలకు ఏకంగా 25 లక్షల మంది హాజరయ్యారు. ఇదొక్కటి చాలు కన్నడనాట పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న క్రేజ్ ఏంటో చెప్పడానికి..? తాజాగా జరిగిన పునీత్ నమన సంస్మరణ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహా ఎంతోమంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
సినీ ఇండస్ట్రీ నుంచి టాప్ హీరోలు, టెక్నీషియన్స్ అంతా అక్కడే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచు మనోజ్ ఒక్కడే కనిపించాడు. ఈ వేదికపై తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ చాలా ఎమోషనల్ అయ్యాడు. 2017లో రాజకుమార సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ తండ్రిగా నటించాడు శరత్ కుమార్. సంతోష్ ఆనందనం తెరకెక్కించిన ఆ చిత్రం 75 కోట్లు వసూలు చేసి కన్నడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్‌లోనూ నటిస్తున్నాడు శరత్ కుమార్. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన బదులు తాను చనిపోయినా బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇదే వేదికపై రాజకుమార 100 రోజుల వేడుక జరిగిందని.. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని కన్నీరు పెట్టుకున్నాడు శరత్ కుమార్.
పునీత్ తన శ్రద్ధాంజలికి వస్తాడనుకున్నానని.. ఎందుకంటే తనకు 67 ఏళ్లని.. కానీ ఆయన శ్రద్ధాంజలికి తాను రావాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ దేవుడు పునీత్ రాజ్‌కుమార్ బదులు తనను తీసుకెళ్లినా బాగుండు అంటూ స్టేజిపైనే ఏడ్చేశాడు శరత్ కుమార్. ఈయన మాటలు విన్న శివన్న కూడా కన్నీరు పెట్టుకున్నాడు. కేవలం శరత్ కుమార్ మాత్రమే కాదు.. పునీత్ సంస్మరణ సభలో చాలా మంది కళ్లు చెమర్చి కనిపించాయి.