తమిళం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో శివకార్తికేయన్ కూడా ఒకడు. ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. రెమో, వరుణ్ డాక్టర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే చేరువయ్యాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఈయన తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదు అంటూ ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. తమిళ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్న స్టూడియో గ్రీన్ ఫిలింస్ అధినేత జ్ఞానవేల్ రాజా.
మూడేళ్ల కింద శివ కార్తికేయన్ హీరోగా మిస్టర్ లోకల్ అనే సినిమా చేశాడు ఈయన. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించలేదు. ఎం రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా పారితోషకం తనకు పూర్తిగా రాలేదు అంటూ మద్రాసు కోర్టును ఆశ్రయించారు శివకార్తికేయన్. సినిమా కమిట్ అయ్యే ముందు తనకు 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని స్టూడియో గ్రీన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
అయితే 11 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన 4 కోట్లు ఇప్పటి వరకు రాలేదని.. పైగా ఆ ఇచ్చిన 11 కోట్లకు టిడిఎస్ కూడా నిర్మాత చెల్లించలేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కడం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సదరు 11 కోట్లకు ఇన్కమ్ టాక్స్ ఏకంగా 91 లక్షలు కట్ అయింది.. నిర్మాత టిడిఎస్ కట్టాడేమో అనుకొని శివ కార్తికేయన్ టాక్స్ చెల్లించలేదు.. కానీ 2022 ఫిబ్రవరి 1న పన్ను ఎగవేత చేసినట్లు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు వచ్చింది.
అప్పుడు చూసుకున్న ఆయన మిస్టర్ లోకల్ సినిమా నిర్మాత టీడిఎస్ కట్టలేదు అనే విషయం తెలుసుకున్నాడు. తన అకౌంట్ నుంచి 91 లక్షలు కట్ అయ్యాయని.. ఈ విషయంలో పూర్తి బాధ్యత నిర్మాత జ్ఞానవేల్ రాజా తీసుకోవాలని శివకార్తికేయన్ డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇంకా తనకు రావాల్సిన 4 కోట్ల రెమ్యూనరేషన్ అలాగే ఆగిపోయిందని.. అది తనకు వచ్చే వరకు ఆ నిర్మాణ సంస్థలో వస్తున్న సినిమాలేవీ విడుదల కాకుండా చూడాలి అంటూ మద్రాస్ హైకోర్టులో విన్నవించుకున్నాడు ఈ హీరో.
స్టూడియో గ్రీన్ సంస్థలో ప్రస్తుతం రెబల్, చియాన్ 61, పత్తు తలా సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. తన బాకీ చెల్లించేత వరకు ఈ మూడు సినిమాలకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏవీ అమ్మకూడదని కోర్టుకు తెలియజేసాడు శివకార్తికేయన్. జస్టిస్ యం సుందర్ ఈ కేసు ఫైల్ చేశారు. మార్చి 31న దీనికి సంబంధించిన హియరింగ్ ఉండబోతుంది.
జ్ఞానవేల్ రాజా, శివకార్తికేయన్ ఇద్దరు 2018 జూలై 6న మిస్టర్ లోకల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అందులో సినిమా మొత్తానికి 15 కోట్ల రెమ్యునరేషన్.. మొదలవడానికి ముందు ఒక కోటి ఇవ్వాలని కండిషన్ ఉంది. మొదట అగ్రిమెంట్ బాగానే ఫాలో అయిన జ్ఞానవేల్ రాజా.. ఆ తర్వాత 4 కోట్లు బాకీ పెట్టడమే కాకుండా టిడిఎస్ కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. వీటన్నింటిని పరిగనణలోకి తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు శివకార్తికేయన్.