కేవలం అభిమానులకు మాత్రమే కాదు.. చాలా మందికి ఉన్న అనుమానం ఇది. అకేషన్ అని వెళ్లి ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చాడు మహేష్ బాబు. ఇదే విషయంపై ఎన్నోసార్లు సూపర్ స్టార్‌ను అడగాలని చూసినా కూడా దానికి ఆయన సమాధానం చెప్పలేదు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా.. కామన్ యాంకర్స్ ఈ పెళ్లి గురించి మహేష్ బాబును అడిగే ధైర్యం కూడా చేయలేదు. అయితే తాజాగా అన్‌స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య అడిగేసాడు.
ఎందుకు మహేష్.. నువ్వు అకేషన్ అని వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చేసావ్ అంటూ ప్రశ్నించాడు. ఒకే ఇండస్ట్రీలో ఉన్నామ్.. పొద్దున్నే లేస్తే మొహాలు మొహాలు చూసుకోవాలి.. మరి అదేంటయ్యా కనీసం పెళ్లికి చెప్పలేదు అంటూ అడిగేసాడు. దానికి మహేష్ బాబు కూడా సిగ్గు పడుతూ సమాధానం చెప్పాడు. ఎప్పుడో 15 ఏళ్ళ కింద జరిగిన విషయం సర్ అది అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్.
చెప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు సర్.. అనుకోకుండా అలా జరిగిపోయింది అది అంటున్నాడు ఈయన. వంశీ సినిమాలో కలిసి నటించారు మహేష్ బాబు, నమ్రత. ఆ సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. అదే ప్రేమగా మారింది. విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. నమ్రత విషయం తన తండ్రి కృష్ణకు చెప్పినపుడు.. ఆయన అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు అంటున్నాడు మహేష్ బాబు.
ఆయన్ని ఒప్పించడానికి కాస్త టైమ్ పట్టిందని.. నువ్వు ష్యూరా అని రెండు మూడు సార్లు అడిగిన తర్వాత.. నీ యిష్టం అన్నాడని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. మంచి అమ్మాయి నాన్న.. మీరు ఓసారి మాట్లాడండి అని చెప్పగానే.. తన తండ్రి ఒప్పుకున్నాడని చెప్పినట్లు తెలిపాడు సూపర్ స్టార్. అలా 2005ఫిబ్రవరి 10న మహేష్ బాబు, నమ్రత పెళ్లి చేసుకున్నారు.
16 ఏళ్ల కింద ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పట్లో వీళ్ల పెళ్లి సంచలనంగా మారింది. చెప్పకుండా పెళ్లి చేసుకునే సరికి మహేష్ దొంగ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అదేం కాదని.. ప్రైవేట్‌గానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు.. అందుకే అలా చేసుకున్నాం అని అన్‌స్టాపబుల్‌లో బాలయ్యకు సమాధానం చెప్పాడు మహేష్.
తమ పచ్చని కాపురంతో అందరికీ షాక్ ఇచ్చారు మహేష్, నమ్రత. ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలో తమను చూసి నేర్చుకోవాలనేలా వాళ్లు ఒక్కటైపోయారు. ఫ్యామిలీ పర్సన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయాడు మహేష్ బాబు. మా ఆయన ఓ బ్రాండ్ అంటుంది నమ్రత శిరోద్కర్. ఆయన లేకుండా జీవితాన్ని ఊహించలేనంటుంది ఈమె.
ఇక నమ్రత లేకుండా నా జీవితం సగంలోనే ఆగిపోయేదేమో అంటున్నాడు మహేష్ బాబు. అన్నీ ఆమె చూసుకుంటుంటే.. నేను మాత్రం షూటింగ్స్ చేసుకుంటున్నా అంటున్నాడు. పిల్లల విషయంలో స్ట్రిక్ట్ పేరెంట్ ఎవరు అని ఓ అభిమాని ప్రశ్నించగా.. తానే విలన్ అంటుంది నమ్రత. మహేష్ బాబు మాత్రం పిల్లల విషయంలో హీరో అని తేల్చేసింది నమ్రత.
ఎప్పుడూ తను కోప్పడినా కూడా పిల్లలు వెళ్లి మహేష్ బాబుకు తనపై కంప్లైంట్ చేస్తారని మనసులో మాట చెప్పింది నమ్రత శిరోద్కర్. వాళ్ళకు ఏం కావాలన్నా మహేష్ బాబు దగ్గరికి వెళ్లి అడుగుతుంటారని చెప్పింది ఈమె. మొత్తానికి పిల్లల విషయంలో మాత్రం మహేష్ బాబు హీరో అయితే తాన విలన్ అని చెప్పి.. ఎవరో ఒకరి భయం అయితే కచ్చితంగా పిల్లలకు ఉండాలి కదా అంటుంది సూపర్ స్టార్ సతీమణి.