సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో జనవరి 8 రాత్రి మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడిగా ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే రమేష్ బాబు. మొదట్లో 15 సినిమాలకు పైగానే హీరోగా నటించాడు. అందులో కొన్ని మంచి విజయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అందగాడిగా రమేష్ బాబుకు మంచి ఇమేజ్ ఉండేది.
ఆ తర్వాత మెల్లగా సినిమాల నుంచి తప్పుకున్నాడు ఈయన. అయితే సినిమాలు మానేసినా కూడా తమ్ముడు మహేష్ బాబుకు అన్నీ తానేయై ముందు నడిచాడు. మహేష్ కెరీర్‌కు అండదండగా నిలిచాడు. పెళ్లికి ముందు వరకు కూడా ప్రతీ చిన్న విషయం కూడా అన్నయ్య సలహాతోనే చేసాడు సూపర్ స్టార్. ఆ తర్వాత కూడా అన్నతో పాటు అడుగులు వేసాడు. చిన్నప్పటి నుంచి తనకు మరో తండ్రిలా అన్నయ్య ఉండేవాడని చాలాసార్లు చెప్పాడు మహేష్ బాబు.
ఈ సందర్భంగా అన్నయ్య గురించి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు మహేష్ బాబు.‘నువ్వే నా ఆదర్శం.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నువ్వే నాకు అన్నీ.. ఈ రోజు నువ్వు లేకపోతే నేను సగం మాత్రమే ఉన్నట్లు.. నా కోసం నువ్వు చేసిన ప్రతీ విషయానికి థ్యాంక్ యూ.. ఇంక ఇప్పటి నుంచి కేవలం నువ్వు రెస్ట్ తీసుకో.. నిన్ను మిస్ అవుతాను అన్నయ్య.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను..’ అంటూ లేఖ రాసాడు మహేష్ బాబు.
ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతుంది. మహేష్ బాబుతో రమేష్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వయసులో చాలా పెద్ద వాడు కావడంతో చిన్నప్పటి నుంచి మహేష్‌ను ఎత్తుకుని పెంచాడు రమేష్ బాబు. పైగా కలిసి నటించారు కూడా. మహేష్ బాబు హీరో అయిన తర్వాత అతడితో కలిసి అర్జున్, అతిథి సినిమాలు నిర్మించాడు. దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా ఉన్నాడు. మొత్తానికి అన్నాదమ్ముల మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.
మహేష్ బాబుకు కరోనా సోకడంతో కుటుంబంతో పాటు ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. దాంతో ఆయన బయటికి రాలేదు. దుబాయ్ నుంచి ఈ మధ్యే వచ్చిన మహేష్ బాబుకు కరోనా సోకింది. దాంతో ఇంటికే పరిమితం అయిపోయాడు సూపర్ స్టార్. అంతలోనే ఆయన ఇంట్లో తీరని విషాదం చోటు చేసుకుంది. సొంత అన్నయ్య చనిపోతే కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు సూపర్ స్టార్. దానికి ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు కూడా. అన్నయ్య ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించాడు సూపర్ స్టార్.