సమంత కెరీర్ మొదలై ఇప్పటికి 12 ఏళ్లైంది. ఇన్నేళ్లలో దాదాపు 40 సినిమాలకు పైగానే నటించింది స్యామ్. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు కూడా తన ఖాతాలో ఉన్నాయి. స్టార్ హీరోలందరితోనూ నటించింది సమంత. అయితే ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఈమె ఐటం సాంగ్స్ వైపు అడుగేయలేదు. కానీ తొలిసారి ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది.
విడాకుల తర్వాత సమంత ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. కెరీర్లో మొదటి సారి పుష్ప సినిమా కోసం ఐటం గాళ్ అవతారం ఎత్తబోతుంది సమంత. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.
ఇద్దరూ వేర్వేరుగా రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది. అటు ముందు రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను సెట్ చేసాడు సుకుమార్.. ఆ తర్వాత రెండేళ్ళకు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో రంగస్థలం రికార్డులను తిరగరాసాడు. అలాంటి ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి.
ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే అన్ని పాటల చిత్రీకరణ పూర్తైంది. కేవలం మరో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఎప్పట్లాగే సుకుమార్ మార్క్ మాస్ ఐటమ్ నెంబర్. తన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు సుక్కు. తొలి సినిమా ఆర్య నుంచి నిన్నటి రంగస్థలం వరకు ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే ఐటం సాంగ్ పెట్టాడు లెక్కల మాస్టారు.
టాప్ హీరోయిన్స్ కూడా ఈయన సినిమాల్లో ఐటం గాళ్స్గా మారిపోతుంటారు. ఇప్పుడు పుష్పలోనూ అదిరిపోయే మాస్ నెంబర్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ పాట కోసం పూజా హెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరికి మాజీ అక్కనేని కోడలు సమంత చిందేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్‌తో సమంతకు మంచి రిలేషన్ ఉంది. రంగస్థలం లాంటి సినిమా తనకు ఇచ్చాడనే కృతజ్ఞత కూడా ఉంది.
అందుకే ఈ పాటలో నటించడానికి స్యామ్ కూడా ఓకే చెప్పింది. ఈ పాటలో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తుంది సమంత. కెరీర్లో ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ జోలికి వెళ్లని సమంత.. తొలిసారి అలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతటా ఆసక్తి నెలకొంది. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ హైలైట్ అవుతుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది.
ఈ సినిమాలో ఐదో పాట చాలా ప్రత్యేకం.. అందుకే మరింత ప్రత్యేకంగా నిలవాలని సమంతను స్పెషల్ సాంగ్ కోసం అడిగితే.. వెంటనే ఆమె ఒప్పుకున్నారు.. థ్యాంక్ యూ అంటూ పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. ఎప్పట్లాగే దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప కోసం పూనకాలు తెప్పించే ఐటం బీట్ ఇవ్వబోతున్నాడు. ఈ పాటకు ఉ అంటావా.. ఊ అంటావా అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది. పక్కా మాస్ బీట్‌లో సాగే ఈ పాట షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.
ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే గుణశేఖర్ శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. దాంతో పాటు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్‌లో ఓ సినిమా.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ ద్విభాషా చిత్రానికి కమిటైంది. అలాగే బాలీవుడ్ నుంచి కూడా సమంతకు అవకాశాలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తుంది.