మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు.. ఒప్పుకోవడం లేదు ఈయన. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నాడు విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. వరస సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా కొత్త దర్శకులతో పాటు సీనియర్లను కూడా ఈయన ఎంచుకుంటున్నాడు.
తన ఆస్థాన దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవే లేదు. ఇక్కడున్న వాళ్లలో 80 శాతం మంది వారసులే ఉన్నారు. అందులో మంచు వారసులు కూడా ఉన్నారు. ఆ కుటుంబం నుంచి కూడా విష్ణు, మనోజ్ వచ్చారు. మోహన్ బాబు నట వారసులుగా వచ్చిన ఈ ఇద్దరూ ఇప్పటి వరకు స్టార్ హీరోలుగా మాత్రం మారలేకపోయారు. 20 ఏళ్ళ ప్రస్థానంలో ఇప్పటి వరకు సరైన విజయాలు మాత్రం రాలేదు.
ఒకట్రెండు విజయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు. ఇప్పటికీ తమ అస్థిత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు మంచు వారసులు. ముఖ్యంగా విష్ణు అయితే ఢీ, దేనికైనా రెడీ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న తర్వాత కూడా కెరీర్‌ను అనుకున్న దారిలో సెట్ చేసుకోలేకపోయాడు. వరస సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. మొన్నటికి మొన్న 50 కోట్లతో నిర్మించానని చెప్పుకున్న మోసగాళ్లు కూడా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు.
భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన మోసగాళ్ళు వచ్చిన రోజే చాప చుట్టేసింది. అయితే తన కెరీర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి.. ఇప్పటి వరకు స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోకపోవడానికి ఆత్మ విశ్లేషణ చేసుకున్నాడు విష్ణు. దీనికి సమాధానం ఓ షోలో చెప్పాడు. కొందరు దర్శకుల కారణంగానే తన కెరీర్ ఇలా అయిపోయిందని.. తాను చేసిన కొన్ని తప్పులు.. దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నాడు విష్ణు.
ముఖ్యంగా తన కెరీర్లో ఆ 4 సినిమాలు చేయకపోయుంటే ఈ రోజు తన రేంజ్ మరోలా ఉండేదంటున్నాడు ఈయన. కేవలం ఆ దర్శకుల కారణంగానే తను ఫెయిల్యూర్స్ చూసానంటున్నాడు విష్ణు. గతంలోనూ ఓ సినిమా ఫెయిల్యూర్‌కు పూర్తి బాధ్యత దర్శకుడే తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు మంచు వారబ్బాయి. ఇప్పుడు కూడా ఇదే అంటున్నాడు. విష్ణు కామెంట్స్‌కు నెటిజన్స్ నుంచి నెగిటివ్ రిప్లైస్ కూడా వస్తున్నాయి.
నువ్వు కథ ఫైనల్ చేయకుండానే దర్శకుడు ముందుకెళ్తాడా.. నీ తప్పు కూడా ఉంటుంది కదా బ్రదర్ అంటూ విష్ణును ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ 2 ఢీ సినిమా చేస్తున్న విష్ణు.. తాజాగా గాలి నాగేశ్వరరావు అంటూ మరో సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమాను ఇషాన్ సూర్య తెరకెక్కిస్తుండగా.. స్క్రీన్ ప్లే కోన వెంకట్, స్క్రిప్ట్ జి నాగేశ్వరరెడ్డి అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
మంచు విష్ణు 'గాలి నాగేశ్వరరావు'గా లీడ్ రోల్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుకగా సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్రం యూనిట్ మార్చ్ 7న అధికారికంగా ప్రకటించింది. 'గాలి నాగేశ్వరరావు' క్యారెక్టర్ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే.. పాయల్, సన్నీలియోన్ గెటప్‌లను కూడా కార్టూన్ రూపంలో విడుదల చేసారు.
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరా మెన్‌గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.