ఢీ అంటే డాన్సుల కంటే ముందుగా గుర్తుకొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ కెమిస్ట్రీ. ఈ ఇద్దరూ కలిసి ఈ షోను సూపర్ సక్సెస్ చేసారు. ఢీ షో డాన్సులకు కేరాఫ్ అడ్రస్ అయినా కూడా అందులో సుడిగాలి సుధీర్ చేసే కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన లేని ఢీ షో ఊహించడం కూడా కష్టమే. కొన్ని సీజన్స్ నుంచి ఢీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు సుధీర్.
ఆయనతో పాటు రష్మి గౌతమ్ కూడా అందాల ఆరబోతతో పాటు తనదైన డాన్సులతో మైమరిపిస్తుంది. ఢీ టిఆర్పీ అదిరిపోతుందంటే దానికి కారణం సుధీర్ అండ్ రష్మి అనడంలో సందేహం లేదు.. అతిశయోక్తి అంతకంటే లేదు. ఇప్పుడు ఢీ 14 ప్రోమో విడుదలైంది. అందులో సుధీర్, రష్మి ఇద్దరూ కనిపించడం లేదు. అది చూసిన తర్వాత అభిమానులు షాక్ అవుతున్నారు. సుధీర్ లేని ఢీ షోను ఇప్పుడు మేం చూడాల్నా అంటూ కామెంట్ చేస్తున్నారు.
సుధీర్‌తో పాటు రష్మికి కూడా ఉద్వాసన పలికారు మల్లెమాట టీమ్. కొన్ని రోజులుగా దీనిపై ప్రచారం జరుగుతూనే ఉంది. వచ్చే సీజన్ నుంచి సుధీర్ అందుబాటులో ఉండడం లేదనే వార్తలు వస్తున్నా.. అందులో నిజం లేదనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదలైన ప్రోమోలో సుధీర్, రష్మీ గౌతమ్ ఇద్దరూ కనిపించడం లేదు. సుధీర్ స్థానంలో బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ అఖిల్ సార్థక్‌ను తీసుకొచ్చారు.
హైపర్ ఆది మాత్రం అలాగే ఉన్నాడు. యాంకర్ ప్రదీప్ కంటిన్యూ అవుతున్నాడు. ప్రియమణి, గణేష్ మాస్టర్ జడ్జిలుగా ఉన్నారు. కానీ అక్కడ పూర్ణ కనిపించడం లేదు. ఆమెకు సినిమా అవకాశాలు పెరగడంతో అక్కడ బిజీ అయిపోయింది. మరోవైపు యాంకర్ దీపిక పిల్లి కూడా ఒక్క సీజన్‌తోనే మాయం అయిపోయింది. ఒకే సీజన్లో చాలా మార్పులు చేసింది మల్లెమాల టీమ్.
పారితోషికం విషయంలో కొన్నాళ్లుగా మల్లెమాలతో సుధీర్, రష్మి గౌతమ్‌కు చర్చలు నడుస్తున్నాయి. మరి అందులో ఏదీ తేలకపోవడంతో వాళ్ళు తప్పుకున్నారా లేదంటే అంత ఇచ్చేది లేదని నిర్వాహకులే వాళ్లను తీసేసారా అనేది చూడాలి. ఏదేమైనా సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ లేకుండా ఢీ షో మునపటి రేటింగ్ సాధిస్తుందా అనేది అనుమానమే.