కొన్ని సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో క్లాసిక్ స్థాయి అందుకుంటాయి. అలాంటి సినిమాలలో పెళ్లి సందడి కూడా ఉంటుంది. శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇది. 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. 12 కోట్ల షేర్ వసూలు చేసి నిర్మాతలకు ఎన్ని రెట్ల లాభాలు అందించిందో కూడా అర్థం కాలేదు. దాని లాభాలు చాలా కాలం వరకు లెక్క పెడుతూనే ఉన్నామని చెప్పాడు నిర్మాత అల్లు అరవింద్.
ఆయనతో పాటు అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా వచ్చి అప్పుడే పాతికేళ్లైపోయింది. 25 ఏళ్ళ తర్వాత అదే టైటిల్‌తో యాదృశ్చికంగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. అప్పుడు తండ్రి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాతోనే ఇప్పుడు తనయుడు కూడా వస్తున్నాడు. నాలుగేళ్ళ కింద నిర్మల కాన్వెంట్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా.. అది సరదాగానే చేసాడు రోషన్.
ఇప్పుడు పూర్తిస్థాయిలో లాంఛ్ అవుతున్నాడు శ్రీకాంత్ తనయుడు. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో దర్శకేంద్రుడు కూడా నటిస్తున్నాడు. గౌరీ రోనంకీ దర్శకురాలు. ట్రైలర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పండగ సీజన్ కాబట్టి టాక్ బాగా వచ్చిందంటే కచ్చితంగా కలెక్షన్స్ కూడా బాగుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో చూద్దాం..
'పెళ్ళి సందD' చిత్రానికి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొత్త హీరోకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద బిజినెస్ ఇది. కాకపోతే అక్కడ రాఘవేంద్రరావు ఉన్నాడు.. ఆయనతో పాటు బాహుబలి నిర్మాతలు తోడుగా ఉన్నారు.. కాబట్టే సినిమా బిజినెస్ భారీగా జరిగింది. పెళ్లి సందD సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.30 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది. నిర్మల కాన్వెంట్ సినిమాతో రోషన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నాలుగేళ్లకు పైగానే గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. ఇప్పుడేం చేస్తాడో చూడాలి.