ప్రముఖుల సందర్శనార్థం సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. టాలీవుడ్ కి చెందిన హీరోలు, నటీనటులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి కృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు.
స్నేహశీలి, మృదు స్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు.