తెలుగు సినిమా ప్రస్థానం మొదలై 91 ఏళ్ళు దాటిపోయింది. ఈ తొమ్మిది దశాబ్దాలలో ఎన్నో మరపురాని సినిమాలు మన ముందుకు వచ్చాయి. మరెన్నో సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి. కొన్ని వేల సినిమాలు విడుదలై ఉంటాయి. అందులో ది బెస్ట్ 25 సినిమాల లిస్ట్ తీయాలంటే ఎలా ఉంటుంది.. అందులో వేటికి చోటు ఉంటుంది.. అలాంటి సినిమాల్లో కచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా బొమ్మరిల్లు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఇలాంటి ఒక అద్భుతం విడుదలై 15 సంవత్సరాలు గడిచింది. 2006 ఆగస్టు 9న విడుదలైన బొమ్మరిల్లు థియేటర్లలో నిజంగానే బొమ్మరిల్లు విరబూసేలా విజయం సాధించింది.
ఎలాంటి అనుభవం లేని తొలి సినిమా దర్శకుడు.. కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన కథానాయకుడు.. హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు తప్ప గుర్తింపులేని కథానాయకి.. వరుస విజయాలతో దూసుకుపోతున్న నిర్మాత.. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బొమ్మరిల్లు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో సినిమా చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ కథలో విలన్స్ ఉండరు. ఉన్న ప్రతి నాయకుడు నాన్న మాత్రమే. కానీ ఆయనలోనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది.. బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఒక్కోసారి ప్రేమ ఎక్కువైనా కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.
వెలకట్టలేని తండ్రి ప్రేమ తక్కువ ఉంటే అసలు తట్టుకోలేము.. అలాగని ఎక్కువగా ఉంటే కూడా భరించలేము.. ఈ విషయాన్ని చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాడు భాస్కర్. కొందరు తండ్రులు తమ పిల్లలను ఎంత ప్రేమిస్తారు.. ఆ ప్రేమలో వాళ్ల స్వేచ్ఛను కూడా ఎలా హరిస్తారు అనేది బొమ్మరిల్లు సినిమాలో చాలా కష్టంగా ఉంటుంది. ఈ పాయింట్ చాలా మందికి కనెక్ట్ అయింది. అందుకే సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తున్నారు. మరీ ముఖ్యంగా సిద్దు పాత్రలో నటించిన సిద్ధార్థ.. ఆయన తండ్రి ప్రకాష్ రాజ్ పాత్ర ఇప్పటికీ ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటాయి.
అసలు బొమ్మరిల్లు సినిమాకు బీజం ఎక్కడ పడింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దిల్ రాజు నిర్మాణ సంస్థలో అప్పటికే ఆర్య, భద్ర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు భాస్కర్. ఆర్య సినిమా చేస్తున్నప్పుడే మంచి స్టోరీ ఉంటే నేను నిన్ను దర్శకుడిని చేస్తాను అంటూ రాజు.. భాస్కర్ కు మాటిచ్చాడు. భద్ర సినిమా జరుగుతున్నప్పుడు బొమ్మరిల్లు కథ చెప్పాడు భాస్కర్. అది దిల్ రాజుకు వినగానే నచ్చేసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా చేస్తున్నట్లు అప్పట్లో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. నటీనటుల విషయంలో కూడా భాస్కర్ చాలా క్లారిటీగా ఉన్నాడు. ముందు ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా అనుకున్నా.. ఆయన బిజీగా ఉండడంతో సిద్ధార్థ్ లైన్లోకి వచ్చాడు.
2006 మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. కేవలం మూడున్నర నెలల్లో షూటింగ్ పూర్తి చేశారు. జనవరిలో రామానాయుడు స్టూడియోలో మొదలుపెట్టి ఆగస్టు 9న సినిమాను విడుదల చేశారు. 100 రోజుల పని దినాల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశాడు భాస్కర్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఒక సంచలనం. బొమ్మరిల్లు పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటారు అభిమానులు. ఈ సినిమా ఆడియో విడుదలకు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోలు హాజరయ్యారు. విడుదలకు ముందే చాలా మంచి అంచనాలు బొమ్మరిల్లు సినిమాపై ఏర్పడ్డాయి. వాటిని నిజం చేస్తూ విడుదలైన తర్వాత కూడా సంచలన విజయం సాధించింది ఈ సినిమా.
కేవలం 72 ప్రింట్లు.. 130 థియేటర్లలో విడుదలైంది బొమ్మరిల్లు సినిమా. విడుదలైన ఉదయం ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. తొలి వారంలోని 5 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అక్కడి నుంచి మొదలైన బొమ్మరిల్లు ప్రభంజనం 100 రోజుల వరకు కొనసాగింది. 15 ఏళ్ల కింద ఈ సినిమా దాదాపు 22 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులో మూడున్నర కోట్లకు పైగా ఓవర్సీస్ నుంచి కలెక్ట్ చేయడం ఒక సంచలనం. అప్పట్లో మరే సినిమాకు సాధ్యంకాని విధంగా విదేశాల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా కమర్షియల్ గానూ కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఓవర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాకు ఓపెన్ అయింది బొమ్మరిల్లు సినిమాతోనే.
అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో తండ్రీకొడుకుల సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ బొమ్మరిల్లు మాత్రం ఒక విభిన్నమైన కథ. ఇందులో కూడా తండ్రికొడుకుల సెంటిమెంట్ హైలెట్ గా ఉంటుంది. కానీ ఇందులో మితిమీరిన ప్రేమ చూపించే ఒక తండ్రి వల్ల కొడుకు పడే బాధలు చాలా వినోదాత్మకంగా.. అలాగే ఆలోచనాత్మకంగా చూపించాడు భాస్కర్. ఇలాంటి కథకు ముగింపు పలకడం అంటే చిన్న విషయం కాదు. అందుకే బొమ్మరిల్లు క్లైమాక్స్ ఒక సంచలనం. అక్కడ సిద్దూ చిన్నప్పటి నుంచి తను పడే బాధలను తండ్రికి వివరించే సన్నివేశాలు ఒక అద్భుతం. అలాగే ప్రకాష్ రాజ్ తన నటనలో చూపించిన పరిణతి కూడా అమోఘం. ఇద్దరు అద్భుతమైన నటులు స్క్రీన్ పై పర్ఫార్మ్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనడానికి బొమ్మరిల్లు క్లైమాక్స్ ప్రత్యక్ష నిదర్శనం.
బొమ్మరిల్లు సినిమాలో మరో అద్భుతమైన క్యారెక్టర్ హాసిని. జెనిలియా కెరీర్లో ఇంతకంటే గొప్ప క్యారెక్టర్ లేదు.. ఇకపై రాదు కూడా. 20 ఏళ్ల అమ్మాయి ఎంత అల్లరిగా ఉంటుంది.. ఎంత అనుకువగా ఉంటుంది.. ఎంత అమాయకంగా ఉంటుంది.. ఈ మూడు లక్షణాలు హాసిని పాత్రలో అద్భుతంగా చూపించాడు భాస్కర్. అందుకే బొమ్మరిల్లు సినిమా వచ్చే 15 ఏళ్లు అయినా కూడా హా హా హాసిని అంటూ ఇప్పటికీ ఆ డైలాగ్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. జెనీలియా ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ జీవించింది. ఈ ఒక్క సినిమాతో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.
బొమ్మరిల్లు సినిమాకు అవార్డులు కూడా అలాగే వచ్చాయి. ఒకటి రెండూ కాదు ఏకంగా 7 నంది అవార్డులు బొమ్మరిల్లు సినిమాను వరించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్క్రీన్ప్ ప్లే, ఉత్తమ మాటల రచయిత, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇన్ ఫిమేల్, ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ కేటగిరీలలో బొమ్మరిల్లు సినిమా అవార్డులు అందుకుంది. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కించుకుంది బొమ్మరిల్లు సినిమా.
ఇలాంటి అద్భుతమైన సినిమా వచ్చినపుడు మిగిలిన భాషల వాళ్ళు కూడా ఖచ్చితంగా తమ ఆడియన్స్ కి ఇవ్వాలి అనుకుంటారు. అందుకే బొమ్మరిల్లు సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ హీరోలుగా రీమేక్ చేయాలనుకున్నా ఆ ప్రయత్నం వర్కవుట్ కాలేదు. అయితే హర్మన్ భవేజ, జెనీలియా జంటగా ఇట్స్ మై లైఫ్ పేరుతో అక్కడ రీమేక్ చేశారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమా 12 ఏళ్ళుగా విడుదల కాకుండానే ఉండిపోయింది. మరోవైపు తమిళనాట జయం రవి హీరోగా సంతోష్ సుబ్రమణ్యం.. బెంగాలీలో భాలోబాస భాలోబాస.. ఒడియాలో డ్రీమ్ గర్ల్ పేరుతో రీమేక్ చేశారు. దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా విజయం సాధించింది. బొమ్మరిల్లు తెరకెక్కించిన తర్వాత మళ్లీ అంతటి విజయం కోసం 15 ఏళ్లుగా భాస్కర్ వేచి చూస్తూనే ఉన్నాడు.