కొన్ని సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా అదే ఆదరణ ఉంటుంది. కావాలంటే దృశ్యం సినిమానే తీసుకోండి. ఎక్కడో మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఆ తర్వాత ఏడు భాషల్లో రీమేక్ అయింది. అన్ని చోట్లా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్గానూ విజయం సాధించింది. చైనీస్, శ్రీలంకన్ భాషల్లోనూ రీమేక్ అయిన తొలి ఇండియన్ సినిమా ఇదే.
ఇప్పుడు మరోసారి మలయాళ సినిమాకే ఇలాంటి అరుదైన గుర్తింపు వచ్చేలా కనిపిస్తుంది. 2020 ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయం సాధించిన ‘అయ్యప్పునుమ్ కోశియుమ్’ సినిమా గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సాచి ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం విడుదలైన 5 నెలలకు ఆయన హార్ట్ ఎటాక్‌తో మరణించడం విషాదం.
ఇదిలా ఉంటే ‘అయ్యప్పునుమ్ కోశియుమ్’ సినిమా కోసం ఇతర భాషల హీరోలు ఎగబడుతున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కిస్తున్నారు. మన దగ్గర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవన్ పేరు చెప్పి తెలుగులో ఈ సినిమాకు 100 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నారు.
ఒరిజినల్లో ఇద్దరు హీరోలకు ఒకే రకమైన ప్రాముఖ్యత ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి పవన్ డామినేట్ చేస్తున్నాడు. హిందీలో కూడా జాన్ అబ్రహాం అలాగే చేస్తాడేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే అభిషేక్ బచ్చన్ ‘అయ్యప్పునుమ్ కోశియుమ్’ రీమేక్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నాడు. దాంతో మరో హీరో కోసం వేట మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు.