మీర్జాపూర్ వెబ్ సిరీస్ కేవలం ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రమే కాదు.. దక్షిణాదిన కూడా బాగా హిట్ అయింది. అందులో నటించిన నటులంతా మన వాళ్లకు కూడా బాగానే పరిచయం. ముఖ్యంగా మున్నా గ్యాంగ్ అయితే బాగా పరిచయం. ఆయన కారెక్టర్ అంత పెద్ద హిట్ అయింది. మున్నా మాటలు మీమర్స్ తెగ వాడుకుంటారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా గ్యాంగ్‌లో ఉండే లలిత్ పాత్ర కూడా చాలా మందికి పరిచయమే.
ఇప్పుడు ఆయన లేడు.. అనుమానాస్పద స్థితిలో ముంబైలోని తన ఇంటి బాత్రూమ్లోనే శవమై తేలాడు. ఆ నటుడు పేరు బ్రహ్మ స్వరూప్ మిశ్రా. కేవలం 36 ఏళ్ళ వయసులోనే ఈయన కన్నుమూసాడు. మీర్జాపూర్ సిరీస్ నుంచి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మిశ్రా. ఈయన చనిపోయాడన్న వార్త తెలుసుకుని అయ్యో పాపం అనుకుంటున్నారు ఆడియన్స్.
నార్త్‌లో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న బ్రహ్మ మిశ్ర చనిపోవడం ఇండస్ట్రీకి తీరనిలోటు అంటూ అతడితో నటించిన వాళ్లంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. కేవలం 36 ఏళ్ళ వయసులోనే అతడు మరణిస్తాడని కలలో కూడా అనుకోలేదంటున్నారు తోటి నటీనటులు. అనుమానస్పదంగా ఇంట్లో చనిపోయి ఉండటంతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.