శంకర్ సినిమా అంటే కథ ఏంటి కాదు.. బడ్జెట్ ఎన్ని వందల కోట్లు అని అడగాలి. ఎందుకంటే ఈయన ఒక్కో సినిమా కోసం పెట్టే బడ్జెట్‌తో కనీసం 10 సినిమాలు తీయొచ్చు. ఐదేళ్ళ కిందే 2.0 సినిమా కోసం 400 కోట్లు ఖర్చు చేయించాడు శంకర్. దానికి ముందు కూడా ఈయన సినిమా బడ్జెట్ కోటలు దాటుతుంది. తొలి సినిమా జెంటిల్ మెన్ నుంచి నిన్నటి 2.0 వరకు కూడా శంకర్ బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు.
కావాలంటే తాను రెమ్యునరేషన్ కట్ చేసుకుంటాడు కానీ బడ్జెట్ మాత్రం తగ్గించడానికి నో అంటాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు ఈ దర్శకుడు. అలాంటి సంచలన దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం మూడు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో అప్పుడే లెక్కలేయడం మొదలు పెట్టారు అభిమానులు.
కాన్సెప్ట్ పోస్టర్ కోసమే 1.73 కోట్లు ఖర్చు చేయించాడు శంకర్. మొన్నటికి మొన్న ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు చేయించినట్లు ప్రచారం జరుగుతుంది. 7 నిమిషాల పాటు సాగే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. దానికోసం ఏకంగా 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. సినిమాలో అత్యంత కీలకంగా వచ్చే సీన్ కోసం శంకర్ తగ్గేదే లే అంటున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటికి వచ్చింది. ఇందులో ఓ పాట కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేయించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సాధారణంగానే తన సినిమాలలో పాటల కోసం భారీగా ఖర్చు చేయిస్తుంటాడు శంకర్. తాజాగా చరణ్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇందులో ఒక్క పాట కోసం 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఇదే నిజమైతే అంతకంటే సంచలనం మరోటి ఉండదు. ఎందుకంటే 25 కోట్లతో దిల్ రాజు ఓ సినిమానే తీస్తాడు.. అలాంటిది ఒక్క పాట కోసం ఖర్చు చేయడం మామూలు విషయం కాదు. దిల్ రాజు నిర్మాణంలో రాబోయే 50వ సినిమా ఇది. 2017లో అల్లు అర్జున్ డిజే సినిమాతో 25 సినిమాల మైలురాయి అందుకున్న దిల్ రాజు.. ఈ ఐదేళ్లలోనే మరో 24 సినిమాలు పూర్తి చేసాడు.
ఇప్పుడు 50వ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బడ్జెట్ కారణంగా శంకర్ ఇప్పటి వరకు విమర్శలు బాగానే ఎదుర్కొన్నాడు. 2.0 సినిమాకు భారీ నష్టాలు రావడానికి.. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా మధ్యలో ఆగిపోవడానికి కారణం హై బడ్జెట్టే. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెట్టిస్తున్నాడు. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నాడు.
ఇందులో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉండవని.. కేవలం కథా ప్రధానంగా సాగే కథ ఇది అని తెలుస్తుంది. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్‌గానే కాకుండా కాసేపు ముఖ్యమంత్రిగానూ చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం 250 కోట్లు దిల్ రాజు కేటాయించాడని తెలుస్తుంది. ఇందులో కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను రెండు మూడేళ్లు కాకుండా కేవలం ఒకే ఏడాదిలో పూర్తి చేయాలని చూస్తున్నాడు.