అదేంటి.. అల్లు అర్జున్‌కు రాజమౌళి ఎందుకు వార్నింగ్ ఇస్తాడబ్బా అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది. తాజాగా పుష్ప సినిమా వేడుకకు వచ్చిన జక్కన్న.. సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చాడు దర్శక ధీరుడు. డిసెంబర్ 12న యూసఫ్ గూడా గ్రౌండ్స్‌లో పుష్ప ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. దీనికి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ముఖ్యంగా సినిమా గురించి మాత్రమే కాదు.. అల్లు అర్జున్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు జక్కన్న. తనకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన దర్శకుడు సుకుమార్ అని.. ఆయన ఈ రోజు ఇక్కడ లేకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుందని తెలిపారు రాజమౌళి.
తామిద్దరం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటామని.. ఒకరి గురించి ఒకరం చర్చించుకుంటామని.. ఈ మధ్య ఎక్కువగా బాంబేకి వెళ్లినప్పుడు అందరూ పుష్ప సినిమా గురించి అడుగుతున్నారని చెప్పారు రాజమౌళి. అక్కడంతా పుష్ప కోసం వేచి చూస్తున్నట్లు గుర్తు చేసాడు. అయితే పుష్ప సినిమాకు సరైన ప్రమోషన్ లేదనే విషయాన్ని రాజమౌళి గుర్తు చేసాడు. సినిమా ఎంత బాగా తీసినా కూడా ప్రమోషన్ సరిగ్గా చేయకపోతే అసలుకే మోసం వస్తుందని అందరికీ తెలుసు.
అదే విషయాన్ని ఇప్పుడు బన్నీ బ్యాచ్‌కు చెప్పాడు రాజమౌళి. చేతిలో అద్భుతమైన ప్రాజెక్ట్ ఉందని.. దాన్ని అనవసరంగా వదిలేయొద్దు అంటున్నాడు జక్కన్న. సినిమాను బాగా ప్రమోట్ చేసుకోవాలని.. తద్వారా మంచి వసూళ్లు వస్తాయంటున్నాడు రాజమౌళి. ముంబైలో తెలుగు సినిమాల కోసం అక్కడి వాళ్లు బాగా ఆసక్తిగా చూస్తున్నారని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రమోషన్ ప్లాన్ చేసుకోవాలని సూచించాడు రాజమౌళి.
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పెట్టిన డెడికేషన్ గురించి ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన అవసరం లేదని.. పుష్ప సినిమా ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు రాజమౌళి. డిసెంబర్ 17న విడుదల కానుంది ఈ చిత్రం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో ఒకేరోజు విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
పుష్స సినిమాకు తెలుగులో ప్రమోషన్ అవసరం లేదు. ఇక్కడ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ కారణంగా అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయి. మరోవైపు మలయాళంలోనూ తిరుగులేదు. కానీ తమిళం, హిందీలో మాత్రం ప్రమోషన్ అవసరమే. ఇప్పటి వరకు అక్కడ మొదలుపెట్టలేదు. మరి రానున్న 4 రోజుల్లో ఏ మాత్రం ప్రమోట్ చేస్తారో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది.