మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే.. ఆ కళ్లు వెలుగులు చిమ్మాయి. ఆ నవ్వు వెన్నెల పూయించింది. ఆ హొయలు నెమలిని తలపించింది. ఆ మాట వీణలా మోగింది. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార గుర్తుకు వస్తుంది. ఆమె మహానటి సావిత్రి. ఆమె వర్ధంతి సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం. (File/Photo)
నాటి నుంచి నేటి వరకు.. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన అసమాన ప్రతిభాశాలి. అసలు సావిత్రి.. అనే ఈ మూడు అక్షరాలు వింటే చాలు.. తెలుగు ప్రేక్షకులు పులకరించి పోతారు. ఆమె నటన ఒక గ్రంథాలయం. (File/Photo)
తన ప్రతిభతో... ఎంతో మందికి అభిమాన పాత్రురాలయ్యారు సావిత్రి. తరాలు మారినా.. తెలుగు చిత్ర రంగంలో సాటిలేని మేటిగా కీర్తింపబడుతున్న ఏకైక నటి సావిత్రి. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరంటే.. సావిత్రి అని చెప్పేవాళ్లు ఇప్పటికీ తెలుగునాట కోట్లలో ఉన్నారు. అందులో ఎంతో మంద సినీ సెలబ్రిటీలు, రాజకీయ వేత్తలు ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి ఓ ధృవతార. . (File/Photo)
అందం, అభినయం.. కలగలసి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మహానటి. నటనకే భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు సావిత్రి. ఈమె తెర జీవితం కళ్లు జిగేల్మనేలా సాగింది. అలాంటి అభినేత్రి కళ్లు.. నిజజీ వితంలో కన్నీళ్లు కార్చాయి. తెరపై నవ్విన పెదవులు, తెర వెనుక దు:ఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది. ఆమె నట జీవితంలోని హొయలు.. నిజ జీవితంలోంచి వెళ్లిపోయాయి. మాట బాధాతప్తమైంది.. (File/Photo)
ఒక సినిమాలో ఎన్ని మలుపులుంటాయో.. సావిత్రి జీవితంలో అంతకంటే ఎక్కువ మలుపులున్నాయి. నటనలో శిఖరాగ్రానికి చేరిన సావిత్రి మహానటి కావడానికి ముందు ఎంతో నిరాశ ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు. యాక్టర్ కావాలనే పట్టుదలతో వచ్చి.. అనుకున్నది సాధించారామె. తొలి రోజుల్లో వెండితెర ఆమెకు ఎర్రతివాచీలు పరిచి ఆహ్వానించలేదు. నటనపై ఉన్న ఆసక్తితో ఎన్ని కష్టాలెదురైనా పోరాడి నిలదొక్కుకున్నారామె. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని రాయించుకున్నారు సావిత్రి.. (File/Photo)
మహానటి అంటే, దక్షిణాదిలో ఒక్క సావిత్రి పేరే వినిపించేది. ఎందరో ఉత్తమ నటీమణలు దక్షిణాదిలో పుట్టారు. ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. వీరందరి నడుమ సావిత్రి మాత్రమే, మహానటిగా పేరు సాధించడానికి ఎన్నో కారణాలున్నాయి. నవరాసాలను అలవోకగా పండించడంలో దిట్ట. నటించడం కాదు.. ఏపాత్రలోనైనా జీవించండం ఆమెకు దేవుడిచ్చిన వరం. అందుకే తెలుగు సినిమాల్లో సావిత్రి ఎవరగ్రీన్ గా మిగిలిపోయారు. హావభావాలతో అద్భుతంగా నటించి మెప్పించిన నటీమణి సావిత్రి. . (File/Photo)
అందుకే తల్లిగా, చెల్లిగా, వదినెగా ఏపాత్ర వేసినా.. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చిన ఘనత ఆమెది. సావిత్రి తన కెరీర్లో చేసిన కొన్ని పాత్రలకూ... ఆమె రియల్ లైఫ్ కు దగ్గర పోలికలున్నాయి.ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లతో సమానమైన స్టార్ డమ్ సావిత్రి సొంతం. ఆమె గురించి రాయడానికి పదాలు సరిపోవు. ఆమె హుషారుగా నటిస్తే ఆహ్లాదం ఆవరిస్తుంది. ఆమె విషాదాభినయం ప్రేక్షక మనసులను బరువెక్కిస్తుంది. మొదట్లో వేషాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు సావిత్రి. అనేక ప్రయత్నాలు చేయగా 1950లో సంసారం సినిమాలో హీరోయిన్ వేషం లభించింది.. (File/Photo)
అక్కినేని, ఎన్టీఆర్ లు హీరోలు. కానీ ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆ సినిమా డైరెక్టర్ ఎల్. వి. ప్రసాద్, సావిత్రి హీరోయిన్ గా పనికి రాదన్నారు. పదిమంది అమ్మాయిల్లో ఒకరిగా ఉండమన్నారు. చేసేది లేక.. సావిత్రి హీరోయిన్ ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించారు. 1951లో పాతాళభైరవిలో ఓ డాన్సర్ గా యాక్ట్ చేసారు కూడా. ఆ తర్వాత 1952లో పెళ్లిచేసి చూడులో కాస్త గుర్తింపు ఉండే పాత్ర లభించింది. ఇక 1953లో విడుదలైన దేవదాసులోని పార్వతి పాత్ర.. సావిత్రి నట జీవితాన్ని రాత్రికి రాత్రి మార్చివేసింది. దేవదాసులో హీరోయిన్ రోల్ కు మొదట మరో నటిని అనుకున్నారు. కానీ, చివరకు ఆ కేరెక్టర్ సావిత్రిని వరించింది. ఈ సినిమాతో సావిత్రి నట జీవితం మలుపు తిరిగింది. ఇదామెకు తొలి విజయం. . (File/Photo)
ఈ మూవీలో నాగేశ్వర్రావుకు ధీటుగా నటించి మెప్పించారామె. దేవదాసుగా ఏఎన్నాఆర్ ఎంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారో.. పార్వతిగా.. సావిత్రి అంతే పేరు సాధించారు. ఆమె నట జీవితానికి పునాది వేసిన చిత్రంగా దేవదాసు చరిత్రలో నిలిచిపోయింది. సావిత్రి నట జీవితంలో మరో మలుపు మిస్సమ్మ. భానుమతి చేయాల్సిన ఆ పాత్రను.. సావిత్రి పోషించి భేష్ అనిపించారు. ఈ సినిమాలో.. మిస్ మేరీగా సావిత్రి నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదామె. మిస్సమ్మలో భానుమతి మిస్ చేసుకున్న హీరోయిన్ పాత్ర.. సావిత్రిని అనుకోకుండా వరించింది.. (File/Photo)
భానుమతి షూటింగ్ కు ఆలస్యంగా రావడంతో.. చక్రపాణికి కోపం వచ్చింది. ఆ తర్వాత భానుమతి వేషానికి సావిత్రిని తీసుకున్నారు. అలాగే సావిత్రి వేయాల్సిన పాత్రను జమున కిచ్చారు. మిస్సమ్మగా మేరీ పాత్రలో చిలిపితనాన్ని, కోపాన్ని ఏకకాలంలో అభినయించి.. అబాల గోపాలన్ని అలరించారు. ఎన్నో మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటశిఖరం సావిత్రి. 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లాలో చిర్రావూరులో జన్మించారామె. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో సంగీత, నాట్యాలు నేర్చుకున్నారు. చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి ఆమెకివి ఎంతగానో ఉపయోగ పడ్డాయి.. (File/Photo)
దేవదాసు, మిస్సమ్మ విజయాలతో హీరోయిన్ గా రెండో స్థానంలో నిలిచారు సావిత్రి. తన ముందు తరం హీరోయిన్లు భానుమతి, అంజలీదేవి తర్వాతి స్థానం ఆమెదే. 1957లో విడుదలైన తోడికోడళ్లు, మాయాబజార్ చిత్రాలు గొప్ప విజయాలు సాధించాయి. ఈ సినిమాల సక్సెస్ తో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచారు సావిత్రి.మాయాబజార్ లో మాయా శశిరేఖగా ఎస్వీఆర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు సావిత్రి. ఆ పాత్రలో.. ఆమె నటన నభూతో అన్నట్టు సాగింది. ఉత్తరకుమారుడు రేలంగిని, సావిత్రి ఆట పట్టించే సన్నివేశాలు అందరినీ కట్టిపడేశాయి. నేటికీ ఈ చిత్రం.. సజీవంగా నిలవడంలో ఆమె కృషి మరువలేనిది. కళ్లలో నటనలు పలికించడం.. పెదవి విరుపులతో హావభావాలు ప్రదర్శించడం.. సావిత్రి ప్రత్యేకత. (File/Photo)
చిలిపిదనం ఒలికించే కళ్లే విషాదాన్ని వర్షించేవి. ఆయా సన్నివేశాల్లో ఏడవాల్సి వస్తే నిజంగానే ఏడ్చేసేవారామె. అలా చేయడం మరో నటికి సాధ్యం కాదనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మహానటిగా నేటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. సావిత్రి ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది.. ఆమె కనిపించరు. ఇది సావిత్రి నటనకు మెచ్చుతునక. మాటల్లో మెరుపులు ఆమె సొంతం. సావిత్రి ఉంటే సక్సెస్ గ్యారంటీ. ఉత్తమ నటి అవార్డు ఏ సంస్థ ఇచ్చినా.. అది సావిత్రికే వచ్చేది. అర్థాంగిలో మతిస్థిమితంలేని భర్తను మామూలు మనిషిగా చేసుకున్న భార్య పాత్రలో నటించినా.... అప్పుచేసి పప్పుకూడు చిత్రంలో కామెడీ పాత్ర వేసినా ఆమెకే చెల్లింది. (File/Photo)
నటిగా సావిత్రికి, అన్నపూర్ణ సంస్థకు ప్రత్యేక అనుబంధం. ఆ బ్యానర్ లో నిర్మించిన ఒకటి రెండు చిత్రాల్లోతప్ప... మిగిలిన సినిమాలన్నిటిలో సావిత్రే పర్మినెంట్ హీరోయిన్. ఈ సంస్థలో నిర్మించిన దొంగరాముడు, వెలుగునీడలు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు చిత్రాలు నటిగా సావిత్రికి మంచి పేరు తెచ్చాయి. తెలుగు సినిమాల్లో సావిత్రి, నాగేశ్వర్రావుల జంట.. కనువిందు చేసింది. సంతానం చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్.. అనేక చిత్రాల్లో కొనసాగింది. అభిమానం, నమ్మినబంటు, శాంతినివాసం, సిరిసంపదలు, ఆరాధన, మంచి మనసులు, మాయాబజార్, నవరాత్రి, సుమంగళి చిత్రాలల్లో నటించి.. సావిత్రి, ఎఎన్ఆర్ లు హిట్ పెయిర్ గా పేరు సాధించారు. (File/Photo)
ఇక అన్నపూర్ణ సంస్థ చిత్రాలైతే చెప్పక్కర్లేదు. సహజంగా కథానాయికలు కొంచెం లావయితే తెరమరుగవుతారు. కానీ, సావిత్రి ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా నాటికే తక్కిన హీరోయిన్ల కంటే ఎంతో లావు. అయినా ఆ సినిమాతో పాటు ఎన్నో సినిమాల్లో సావిత్రి టీనేజ్ అమ్మాయిగా నటించి మెప్పించారు. వెండితెర ప్రస్థానంలో సావిత్రి హీరోయిన్ గానే కాక క్యారెక్టర్ నటిగానూ యాక్ట్ చేసారు. గోరింటాకులో తల్లిగా అద్భుతంగా నటించారామె.ఎన్టీఆర్, సావిత్రిల జోడి కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. కన్యాశుల్కం, భలేరాముడు, వినాయక చవితి, ఇంటిగుట్టు, శ్రీవేంకటేశ్వర మహత్యం, నర్తనశాల, గుండమ్మకథ, దేవత వంటి అనేక చిత్రాలతో హిట్ పెయిర్ గా నిలిచారు. (File/Photo)
సావిత్రి హిందీ సినిమాల్లోనూ నటించారు. బహుత్ దిన్ హుయే, ఘర్ బసాకే దేఖో, గంగా కీ లహరే, బలరాం శ్రీకృష్ణ చిత్రాల్లో నటించి.. ఉత్తరాది ప్రేక్షకులను సైతం మైమరిపించారు. తెలుగు తర్వాత.. దక్షిణాది భాషల్లో తమిళ్లో ఎక్కువగా నటించారు సావిత్రి. జెమినీ గణేషన్ తో చాలా సినిమాలు చేసారామె. ఆయనతో ‘మనం పోల మాంగల్యం’ సినిమాలో నటిస్తుండగా ప్రేమలో పడి.. ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. తెలుగు మహిళా దర్శకుల్లో భానుమతి తర్వాత సావిత్రిది రెండో స్థానం. చిన్నారిపాపలు, మాతృదేవత, చిరంజీవి, వింత సంసారం.. వంటి సినిమాలను డైరెక్ట్ చేసి, విజయాలను అందుకున్నారు. సినిమాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి.. జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. (File/Photo)
చివరి రోజుల్లో బతకడం కోసం చిన్న చిన్న వేషాలు సైతం చేసారామె. కష్టాలను మరిచిపోయేందుకు వ్యసనాలకు బానిసగా మారారు సావిత్రి. ఆ వ్యసనాలే తీవ్ర నష్టం చేసాయి. ఓ రోజామె హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు. ఎన్నో నెలల పాటూ కోమాలో వుండి.. చివరకు 1981 డిసెంబర్ 26న కన్ను మూసారు. ఏ నెలలో పుట్టిందో అదే నెలలో కన్నుమూయడం విషాదకరం. దాంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసినట్టయింది. ఇక సావిత్రి జీవితంపై తెరకెక్కిన ‘మహానటి’ కూడా ప్రేక్షకులను సైతం ఆకట్టకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన అభినయం కనబరిచారు. (File/Photo)
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో మహానటి సావిత్ర పాత్రలో నిత్యా మీనన్ నటించింది. వెండితెరపై ఆమె పాత్రలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇక మహానుభావులనకు మరణం లేదంటారు. అది సావిత్రి విషయంలో అక్షర సత్యం. అందుకే సినీ పరిశ్రమలో నేటికీ ఎంతో మంది హీరోయిన్లకు స్పూర్తిగా నిలుస్తూనే వున్నారామె. తరాలు మారినా సావిత్రి నాటికీ, నేటికీ, ఎప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల మదిలో ‘వెండితెర సామ్రాజ్ఞి’గా నిలిచే వున్నారు.(File/Photo)