హీరోయిన్లలో చాలా మందికి లేని రికార్డులు సాయి పల్లవి సొంతం అయిపోయాయి. మరీ ముఖ్యంగా ఈమె పాటలకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. సినిమా బడ్జెట్ అంతా ఈమె పాటలకు యూ ట్యూబ్లో వచ్చే వ్యూస్తోనే సంపాదించుకోవచ్చు నిర్మాతలు. అంతగా ఈమె పాటలకు క్రేజ్ ఉంటుంది. రౌడీ బేబీ ఇప్పటికే 1300 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది. దాంతో పాటు ఫిదా వచ్చిండే పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఈమె నుంచి వచ్చిన మరో అద్భుతం సారంగ దరియా. 5 నెలల కింద యూ ట్యూబ్లో విడుదలైన ఈ పాట ఇఫ్పుడు 300 మిలియన్స్ క్రాస్ చేసింది. మన తెలుగు పాటలకు.. అందులోనూ హీరోయిన్స్ మాత్రమే ఉన్న పాటలకు 100 మిలియన్ దాటడానికే చాలా సమయం పడుతుంది. కానీ సాయి పల్లవి మాత్రం నీళ్ళు తాగినంత ఈజీగా యూ ట్యూబ్ రికార్డులను మార్చేస్తుంది.
ఈమె సారంగ దరియా పాటకు ఇప్పుడు 30 కోట్ల వ్యూస్ వచ్చాయి. అంటే 300 మిలియన్స్ అన్నమాట. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమాలోని పాట ఇది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ పాడింది. పవన్ సిహెచ్ ఈ పాటకు సంగీతం అందించాడు. తెలంగాణ జానపదం నుంచి మూలాలు తీసుకుని దీనికి సినిమాటిక్ టచ్ ఇచ్చాడు సుద్దాల.
ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేట మొదలు పెట్టిన సారంగ దరియా.. ఇప్పుడు ఏకంగా 300 మిలియన్స్ వ్యూస్ అందుకుంది. ఈ పాట జోరు చూస్తుంటే ఇక్కడితోనే ఆగేలా కనిపించడం లేదు. సినిమా విడుదలైన తర్వాత మరింత రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఫిదా లాంటి క్లాసిక్ సినిమా తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా రిలీజ్కు ముందే 40 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. లవ్ స్టోరీ షూటింగ్ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేసాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు.
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పిన కథను ఇందులో చూపించబోతున్నాడు. దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కిస్తున్నాడు. ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల.
ఈ కాన్సెప్టును కేవలం యాడ్స్ రూపంలో చూపించడమే కానీ సినిమాలో ఎవరూ అడ్రస్ చేయలేదు. కానీ శేఖర్ కమ్ముల ఇదే కథను చూపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. శేఖర్ కమ్ముల కచ్చితంగా ఈ సినిమాను అందరి మెప్పు పొందేలా తెరకెక్కిస్తాడని నమ్ముతున్నారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.