ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరొకరికి వెళ్లిపోవడం చాలా కామన్. అయితే కొన్నిసార్లు అలాంటి సినిమాలు ఇతర హీరోలకు సూపర్ హిట్ ఇస్తాయి. మరికొన్నిసార్లు ఫ్లాప్ కూడా అవుతాయి. అలా చాలా తక్కువ సమయంలోనే దాదాపు 10 సినిమాలు రిజెక్ట్ చేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఆయన కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు కాలేదు. కానీ తొలి సినిమా మొదలుపెట్టి మాత్రం పదేళ్లు దాటిపోయింది. ఈ దశాబ్దంలో మంచి మంచి సినిమాలు కాదు అనుకున్నాడు సాయి. అలాగే కొన్ని చెత్త సినిమాలు వదిలేశాడు కూడా.. మరి అవేంటో చూద్దాం.
శతమానం భవతి:
సాయి ధరమ్ తేజ్ వదిలేసిన సినిమాలలో మొదటగా చెప్పుకోవాల్సింది శతమానంభవతి. ఇందులో హీరోగా ఈయన్నే ముందుగా అనుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. అది చాలా నచ్చింది కూడా. పైగా దిల్ రాజు నిర్మాణంలో సినిమా అయినా కూడా శతమానం భవతి సినిమాను వదిలేశాడు సాయి ధరమ్ తేజ్. దానికి ఆయన దగ్గర ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉంది. ఈ సినిమా 2017 సంక్రాంతి విడుదలైంది. అదే పండక్కి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా విడుదలైంది. మామయ్య సినిమాతో తాను పోటీ పడడం ఇష్టంలేక శతమానం భవతి కథ నచ్చినా కూడా స్వచ్ఛందంగా దాని నుంచి తప్పుకున్నాడు మెగా మేనల్లుడు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా ఈ సినిమా వచ్చింది. జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
శ్రీనివాస కళ్యాణం:
సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే వచ్చిన మరో సినిమా శ్రీనివాస కళ్యాణం. ఇందులో కూడా ముందుగా సాయి ధరమ్ తేజ్ ను హీరోగా అనుకున్నాడు సతీష్. ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు కూడా ఈ కథ చెప్పాడు సతీష్ వేగేశ్న. చివరి వరకు కూడా ఎన్టీఆర్ కోసం ట్రై చేశాడు కానీ అది కుదరలేదు. అదే సమయంలో సాయి ధరం తేజ్ ను ఒప్పించడానికి కూడా చాలా ట్రై చేశాడు సతీష్ వేగేశ్న. అయితే ఆ సమయంలో చిత్రలహరితో పాటు మరో రెండు సినిమాలకు సైన్ చేయడంతో శ్రీనివాస కళ్యాణం సినిమా వదిలేసుకున్నాడు సాయి. ఆ తర్వాత అందులో నితిన్ నటించిన కూడా ఫలితం మాత్రం తేడా వచ్చింది.
వరల్డ్ ఫేమస్ లవర్:
సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు నిర్మాణంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు శర్వానంద్ ను అనుకున్నాడు క్రాంతి. ఆయన కాదనడంతో కథ సాయి ధరం తేజ్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఈ కథకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు మెగా మేనల్లుడు. అందుకే నో చెప్పాడు. పైగా కె.ఎస్.రామారావు కాంబినేషన్లో చేసిన తేజ్ ఐ లవ్ యు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో వెంటనే అదే నిర్మాణంలో మరో సినిమా చేయడానికి ముందుకు రాలేదు సాయి ధరమ్ తేజ్.
ఆర్ఎక్స్ 100:
మూడేళ్ల కింద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ సినిమా కథను ఇండస్ట్రీలో దాదాపు అరడజను మంది హీరోలకు చెప్పాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇదే విషయం మీడియా ముందు కూడా చెప్పాడు. చాలామంది హీరోలు ఆర్ఎక్స్100 కథ విన్న తర్వాత ముందు చేస్తానని చెప్పి ఆ తర్వాత సైడ్ ఇచ్చినట్లు అజయ్ చెప్పాడు. అందులో విజయ్ దేవరకొండ, శర్వానంద్ లాంటి హీరోలు కూడా ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఈ కథను సాయి ధరమ్ తేజ్ కూడా విన్నాడు. కానీ ఆయన మొదట్లోనే ఈ సినిమా చెయ్యను అని తన నిర్ణయం దర్శకుడికి చెప్పాడు. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100లో కార్తికేయ నటించాడు.. అది బ్లాక్ బస్టర్ అయింది.
సునీల్ రెడ్డి సినిమా:
సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లో ఇప్పటి వరకు నటించిన అత్యంత చెత్త సినిమాల లిస్టు తీస్తే అందులో తిక్క కూడా ఉంటుంది. టైటిల్ కి తగ్గట్లే తిక్కతిక్కగా ఉంటుంది ఈ సినిమా. సునీల్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే తిక్క సినిమా విడుదలకు ముందే ఈయనతో మరో సినిమా చేయడానికి సాయి కమిట్ అయ్యాడు. కానీ ఆ సినిమా విడుదలైన ఫలితం చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నాడు.
సుకుమార్ రైటింగ్స్:
సుకుమార్ రైటింగ్స్‌లో ఆ మధ్య ఒక సినిమా అనౌన్స్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించాడు. తన శిష్యుడు కార్తీక్ చండూను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ ఈ సినిమా ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. జాతకాల నేపథ్యంలో ఈ కథ సాగనుందని తెలిపారు దర్శక నిర్మాతలు. అయితే కేవలం పోస్టర్ దగ్గరే సినిమా ఆగిపోయింది. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. షూటింగ్ మొదలు పెట్టకుండానే ఆగిపోయింది సుకుమార్, సాయి ధరమ్ తేజ్ సినిమా.
కేరింత:
సాయికిరణ్ అడవి తెరకెక్కించిన కేరింత సినిమా గుర్తుందా.. 2015లో వచ్చిన ఈ సినిమా 3ఇడియట్స్ సినిమాకు తెలుగు వర్షన్ లా ఉంటుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా పర్లేదు అనిపించింది. అయితే ఈ సినిమాలో ముందు హీరోగా సాయి ధరమ్ తేజ్ నటించాల్సి ఉంది. అప్పటికే దిల్ రాజు బ్యానర్లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమా చేశాడు సాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మరో రెండు సినిమాలకు దిల్ రాజుతో కమిట్ అయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఈ క్రమంలోనే తన దగ్గరికి వచ్చిన కేరింత సినిమాను కాదని చెప్పాడు సాయి. ఇంత సాఫ్ట్ సినిమాలో తాను నటించలేను అని చెప్పాడు.
దిల్ రాజు సినిమా:
దిల్ రాజు నిర్మాణంలో ఆ మధ్య మరో సినిమాకు కూడా నో చెప్పాడు మెగా మేనల్లుడు. కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయాలనుకున్నారు దిల్ రాజు. కథ విన్న తర్వాత ప్రాజెక్టు కూడా సెట్ అయింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ అనివార్య కారణాలతో సినిమాను అర్థంతరంగా ఆపేశారు. దీనిపై ఇప్పటి వరకు మళ్లీ అప్డేట్ లేదు. అలా ఈ సినిమా మొదలు పెట్టకుండానే ఆగిపోయింది. చిత్రమేంటంటే సాయితో ఆపేసిన ఈ సినిమాను దిల్ రాజు మళ్ళీ ముట్టుకోలేదు.
ఏఎస్ రవికుమార్ చౌదరి సినిమా:
కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు సాయి ధరమ్ తేజ్. ఈ క్రమంలోనే తనకు పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సూపర్ హిట్ సినిమా నిచ్చిన దర్శకుడు కేఎస్ రవికుమార్ చౌదరితో ఒక మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకున్నాడు సాయి. ఇందులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించనున్నాడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. సినిమాను భారీ స్థాయిలో మొదలుపెట్టాలని ప్రణాళికలు కూడా చేశారు. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది. అయితే తప్పకుండా ఈ మల్టీస్టారర్ చేస్తాను అంటున్నాడు దర్శకుడు రవికుమార్ చౌదరి.
గోపీచంద్ మలినేని సినిమా:
విన్నర్ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది సాయి ధరమ్ తేజ్. దీనిపై అప్పట్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఒకవేళ విన్నర్ సినిమా హిట్ అయ్యుంటే ఈ పాటికే ఈ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చుండేదేమో..? కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యే సరికి మళ్లీ ఆలోచనలో పడిపోయారు గోపీ, సాయి జోడీ. అయితే క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తో బౌన్స్ బ్యాక్ అయిన గోపీచంద్ మలినేని.. త్వరలో బాలయ్యతో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమా చేస్తాడేమో చూడాలి.