బెల్లంకొండ శ్రీనివాస్ ఐదేళ్ల నిరీక్షణ తర్వాత రాక్షసుడు సినిమాతో విజయం రుచి చూసాడు. ఈ చిత్రం తొలిరోజే మంచి తెచ్చుకుంది. అయితే వసూళ్ల వేట మాత్రం నెమ్మదిగా మొదలైంది. తొలిరోజే 2.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఇక ఫుల్ రన్లో అమ్మిన దానికంటే రెండు కోట్లు అదనంగా తీసుకొచ్చి బెల్లంకొండకు తొలి విజయాన్ని రుచి చూపించింది రాక్షసుడు సినిమా.
సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకుని హిట్ కొట్టాడు. సుప్రీమ్ తర్వాత అరడజన్ ఫ్లాపులు ఇచ్చిన ఈ హీరో.. ధరమ్ పీకేసి సాయి తేజ్ అంటూ వచ్చి చిత్రలహరి సినిమాతో విజయం అందుకున్నాడు. ఈ సినిమా 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ మరో హిట్ కూడా కొట్టాడు సాయి. తొలివారమే ఈ చిత్రం 20 కోట్ల షేర్ అందుకునేలా కనిపిస్తుంది.
నాగచైతన్య కూడా చాలా ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత చేసిన యుద్ధం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది మజిలీ సినిమాతో హిట్ కొట్టాడు చైతూ. ఈ సినిమా 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక వెంకీ మామతో మరో హిట్ కూడా అందుకున్నాడు చైతూ.
సందీప్ కిషన్ హీరోగా నటించిన నిను వీడని నీడను నేనే సినిమా కూడా పర్లేదనిపించింది. మరీ ఆయన కోరుకున్న విజయం అయితే కాదు కానీ కనీసం ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా డిజాస్టర్ తప్ప మరోటి లేని సందీప్.. నినువీడని నీడనినేనే సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. కానీ తెనాలి రామకృష్ణతో మరో డిజాస్టర్ ఇచ్చాడు వెంటనే.
కిరాక్ పార్టీ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న నిఖిల్.. ఈ ఏడాది ‘అర్జున్ సురవరం’తో వచ్చాడు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం చాలా తక్కువ అంచనాలతో వచ్చింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ చిత్రం 6 కోట్లకు అమ్మితే 9.50 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో అయితే ఏకంగా 3.60 కోట్ల షేర్ తీసుకొచ్చింది.