ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్లో సలార్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎలాంటి సినిమా ఈ కాంబోలో రాబోతుందో అని చర్చించుకుంటున్నారు. సలార్ అనే పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సలార్ షూటింగ్ వేగంగానే జరుగుతుంది. కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఓ సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది.
ఈ మధ్య కాలంలో చాలా సినిమాల కథలను ఒక్క భాగంలో చెప్పలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. కథ పెరిగిపోతుండటంతో రెండు భాగాలుగా చెప్పడానికి చూస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన బాహుబలి రెండు భాగాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. కెజియఫ్ 1 కూడా సంచలనం రేపింది. పుష్ప మొదటి భాగం కూడా మంచి విజయమే అందుకుంది. ఇప్పుడు ఇదే దారిలో సలార్ కూడా వచ్చేస్తుందని తెలుస్తుంది.
సలార్ సినిమాలో ఛత్రపతి ఛాయలుంటాయని తెలుస్తుంది. అందులో అనామకుడిగా ఉన్న వాడు నాయకుడిగా ఎలా మారాడు అనేది కథ. దానికి శ్రీలంక శరణార్థుల నేపథ్యం తీసుకున్నాడు ప్రభాస్. ఛత్రపతి తర్వాత ప్రభాస్ చాలా సినిమాలు చేసాడు కానీ అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా మాత్రం రాలేదు. బాహుబలి కూడా చరిత్ర సృష్టించింది కానీ ఛత్రపతి సృస్టించిన ఆ మ్యాజిక్ అభిమానుల్లో కలిగించలేదు.
సలార్ సినిమాతో మరోసారి అలాంటి మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అలాంటి పవర్ పుల్ కథతో రాబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం అనే కన్నడ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కెజియఫ్ సినిమాతో తనేంటో చూపించాడు. ప్రస్తుతం తెలుగులో 5 సినిమాలకు కమిట్మెంట్ ఇఛ్చాడు ప్రశాంత్. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, చరణ్, బన్నీ ఈయన కోసం లైన్లో ఉన్నారు.
కెజియఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సలార్ లాంటి మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు తెరతీసాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం, కెజియఫ్ సినిమా కథలు వేరుగా ఉంటాయి కానీ మూలకథ మాత్రం ఒక్కటే. అదే అనామకుడిగా ఉన్న వాడు ఉన్నట్లుండి నాయకుడు కావడం. ఇప్పుడు సలార్ సినిమాలో కూడా ఇలాంటి కథనే చెప్పబోతున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం చెప్పాడు ఈ దర్శకుడు.
తన సినిమాలో గ్రూపులో కుడిభుజంలా ఉండేవాడు.. లీడర్ ఎలా అయ్యాడు అనేది కథ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఎవ్వరూ చూపించని స్థాయిలో.. అంత పవర్ ఫుల్‌గా ఇందులో చూపించబోతున్నట్లు తెలిపాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 4 షెడ్యూల్స్ పూర్తయ్యాయి కూడా. 2022 అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇందులో గ్యాంగ్ లీడర్‌గా కనిపించబోయే ప్రభాస్‌కు రివేంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ముంబై మాఫియాను కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్‌లో కూడా ముంబై మాఫియా ఉంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా గురించి తాజాగా మరో అప్డేట్ కూడా బయటికి వచ్చింది. అందులో ఇండోపాక్ వార్ కూడా కనిపించబోతుంది.
1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధ సన్నివేశాలను ఈ చిత్రంలో చిత్రీరించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కథ ప్రకారం 50 ఏళ్ళ వెనక్కి వెళ్తుందని తెలుస్తుంది. కెజియఫ్ కూడా అప్పటి కథే. ఇప్పుడు సలార్ కూడా ఇదే చేయబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్‌లో బాలీవుడ్ నటులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు.
ఈ సినిమా కోసం 200 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఉగ్రం రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ కథను ఒక్క భాగంలో చెప్పడం కష్టమని భావిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే కెజియఫ్ తరహాలోనే 2 భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి 2022 అక్టోబర్‌లో.. రెండో భాగం 2023 సమ్మర్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.