రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ ఉంది కానీ ఒకప్పుడు మాత్రం కేవలం తెలుగు హీరోనే. ఇక్కడే పరిమితం అయిపోయి సినిమాలు చేసాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగిపోయింది. ఈయన కెరీర్ కొత్తలో చేసిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. మరీ ముఖ్యంగా ఒక సినిమా గురించి చెప్పుకోవాలి. ఛత్రపతి లాంటి సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ వేసిన అడుగులు దారుణంగా ఉన్నాయని ఆయన అభిమానులే బాధ పడుతుంటారు.
క్లాస్ సినిమాల వైపు అడుగులు వేసి.. తనకు సెట్ కాని ఇమేజ్ కోసం ప్రయత్నించి చాలాసార్లు ఫ్లాపులు కొని తెచ్చుకున్నాడు ప్రభాస్. అది నాటి పౌర్ణమి నుంచి నేటి రాధే శ్యామ్ వరకు కంటిన్యూ అయింది. ఇదిలా ఉంటే ప్రభాస్ కెరీర్ మొత్తంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చక్రం. ఇది ఫ్లాప్ అయినా కూడా దీని గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రభాస్ ఫ్యాన్స్ మొహంలో ఏదో తెలియని చిరునవ్వు వస్తుంది.
కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో దారుణంగా నిరాశ పరిచింది. చక్రం సినిమా విడుదలై మార్చ్ 25కి సరిగ్గా 17 ఏళ్ళైంది. ఈ సినిమా చేసే ముందు చాలా మంది ప్రభాస్‌ను హెచ్చరించారు. కథ బాగానే ఉన్నా మన వాళ్లకు కనెక్ట్ అవ్వదు.. రిస్క్ తీసుకోవద్దు అంటూ చెప్పారు కూడా. అయినా కూడా ప్రభాస్ డేర్ చేసాడు. మొత్తానికి మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది.
ఈ సినిమా 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటికి తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ప్రేక్షకులు చూడరు అనే నానుడి ఉంది. అందుకే ప్రభాస్ అలాంటి కథ ఎంచుకున్నాడని తెలిసి.. ఆయన శ్రేయోభిలాషులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చక్రం సినిమాను చేయొద్దంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అందులో చిరంజీవి ముందున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ కూడా ఉన్నాడు.
మరీ ఇంతలా ప్రయోగాలు అవసరం లేదు.. ఆలోచించుకో అని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పాడు కూడా. తరుణ్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలు వద్దని చెప్పినా వినలేదు ప్రభాస్. కేవలం ఆయన మొహమాటం కారణంగా కృష్ణవంశీకి మాటిచ్చేసాడు. ఇచ్చిన మాట కోసం చక్రం సినిమా చేసాడు. నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా ఈ సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చింది.
అసిన్, ఛార్మి ఇందులో హీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. అయితే థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ.. యూ ట్యూబ్, ఛానెల్స్‌లో మాత్రం ఇప్పటికీ చక్రంకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా సిరివెన్నెల గారు రాసిన ‘జగమంత కుటుంబం’ పాట ఓ క్లాసిక్. ఏదేమైనా ప్రభాస్ కెరీర్లో మొహమాటంతో వచ్చిన ఫ్లాప్‌గా చక్రం చరిత్రలో నిలిచిపోయింది.