ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. అందులో ఏది ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకేసారి అరడజన్ సినిమాలు కమిట్ అవ్వడంతో ఎప్పుడు ఏది రాబోతుందో ఆయనకు కూడా క్లారిటీ రావడం లేదు. ముందు కమిటైన సినిమాలు తర్వాత.. ఆలస్యంగా కమిటైన సినిమాలు అనుకున్న దానికంటే ముందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది.
మార్చ్ 11న రాధే శ్యామ్ సినిమాతో వచ్చేస్తున్న ప్రభాస్.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్ సినిమాను తీసుకొస్తున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ భారీ మైథలాజికల్ వండర్‌ను 3డిలో విడుదల చేయబోతున్నారు. టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్.
భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈయన రావణుడిగా నటిస్తున్నాడు. లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
జనవరి 12, 2023 సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది చిత్రయూనిట్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
ఇదివరకే ఈ సినిమా గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. టి సిరీస్‌లో కొత్త ఐడియాలు, కొత్త కాన్సెప్ట్‌లు ఎప్పుడూ మేము ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఫిలిం మేకింగ్‌లో సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూనే ఉన్నాం. ఓం ఆయన టీం కలిసి ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. దానికోసం ఇంటర్నేషనల్ సినిమాలో వాడే లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. తొలిసారి ఇండియాలో అంత భారీ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నాం. ఇలాంటి ఒక అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం.. అని తెలిపారు.