నిజంగానే ఇప్పుడు ఇదే జరుగుతుంది. తెలుగు ఆడియన్స్‌ను పిచ్చోళ్లను చేసే పనులు కొన్నిసార్లు దర్శక నిర్మాతలు బాగానే చేస్తుంటారు. మరీ పిచ్చి కాకపోతే సగం పూర్తైన సినిమాను.. క్లైమాక్స్ లేకుండా థియేటర్స్‌లోకి తీసుకొస్తే ఎంత కామెడీగా ఉంటుంది..? రానా 1945 సినిమా విషయంలో ఇదే జరిగింది. జనవరి 7న విడుదలైంది ఈ చిత్రం. ఇది చూసిన తర్వాత రానా ఎందుకు దీనికి దూరంగా ఉన్నాడో అర్థమవుతుంది.
సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడం లేదని తెలిసిన తర్వాత.. కలుగులోకి ఎలకలు కానీ బయటికి వచ్చినట్లు.. ఎక్కడెక్కడి సినిమాలన్నీ ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు అయితే సంక్రాంతి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే వరసగా సినిమాలన్నీ అప్పుడే వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా విడుదల కాని సినిమాలు కూడా ఈ పండక్కి తీసుకొస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు రానా విషయంలో కూడా ఇదే జరిగింది. నాలుగేళ్ల కింది ఆగిపోయిన 1945 సినిమాను ఇప్పుడు విడుదల చేసారు.
ఎప్పుడో ఈయన నటించి మరిచిపోయిన 1945 అనే సినిమా వచ్చిందిపుడు. అందులో రానా కనీసం డబ్బింగ్ కూడా చెప్పలేదు. ఈ సినిమా విషయంలో పెద్ద కాంట్రవర్సీ అయింది. రానా ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి వివాదాలు. ప్రస్తుతం ఈయన రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఏది ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తున్నాడు మరి.
దానికితోడు ఈ మధ్య అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాడు రానా. ఇదిలా ఉంటే జనవరి 7న ట్రిపుల్ ఆర్ డేట్ రోజు ఈయన నటించిన 1945 సినిమా విడుదల చేసారు. నిజానికి ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్ విడుదలైన వెంటనే రానా కూడా సంచలన ట్వీట్ చేసాడు. ఈ సినిమాతో తనకు సంబంధం లేదని.. అసలు ఇప్పుడు ఉన్నట్లుండి ఫస్ట్ లుక్ ఎందుకు విడుదల చేసారో కూడా తెలియదని చెప్పాడు.
దానికితోడు ఇది ఒక పూర్తికాని సినిమా అంటూ నిర్మాతపై మండిపడ్డాడు. సగం పూర్తైన సినిమాకు విడుదల తేదీని ఎలా ప్రకటిస్తారో తెలియదంటూ రెచ్చిపోయాడు. అసలు ఇలాంటి సినిమాలను, నిర్మాతలను నమ్మొద్దంటూ ట్వీట్ చేసాడు. దీనిపై నిర్మాత కూడా సీరియస్ అయ్యాడు. సినిమా పూర్తైందో లేదో దర్శకుడు చూసుకుంటాడులే అన్నట్లు ట్వీట్ చేసాడు. దానికి రానా కూడా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇలాంటి సమయంలో దర్శకుడు శివ మధ్యలోకి వచ్చేసాడు. ఈ సినిమా పూర్తైందని.. ఇప్పటికే శాటిలైట్ బిజినెస్ కూడా జరిగిపోయిందని చెప్పాడు. సినిమా ఫైనల్ వెర్షన్ కూడా చూసుకున్నానని.. అది కూడా బాగా వచ్చిందని చెప్తున్నాడు దర్శకుడు శివ. రానా తమిళ వెర్షన్ డబ్బింగ్ కూడా చెప్పాడని ఆయన చెబుతున్నాడు. కానీ రానా మాత్రం సినిమా ఇంకా పూర్తి కాలేదంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు విడుదలైన తర్వాత చూస్తే రానా మాటే నిజమైంది.
సినిమా విడుదలకు ముందు దర్శకుడు బాగా ఎమోషనల్ అయ్యాడు. తన కెరీర్‌తో ఆడుకోవద్దని.. నిర్మాతకు మీకు మధ్యలో ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలంటూ హీరో రానాకు ఆయన విన్నవించుకుంటున్నాడు. ఇదంతా జరిగి కూడా రెండేళ్లు దాటిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు సినిమా విడుదల కాలేదు. అయితే మధ్యలోకి సి కళ్యాణ్ వచ్చి సినిమా తీసుకున్నాడు. ఇప్పుడు 1945ను విడుదల చేసాడు.
అసలు విషయం ఏంటే సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా బలమైన సన్నివేశం లేదు. మరీ ముఖ్యంగా స్టార్ క్యాస్ట్ భారీగానే ఉన్నా కూడా కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు దర్శకుడు సత్యశివ. ఎమోషనల్ సీన్స్ లేవు.. కథనం వీక్‌గానే ఉంది. దేశభక్తి నేపథ్యంలో సినిమా అంటే అలాంటి సీన్స్ ఉంటే సినిమాలో బలం ఉంటుంది. కానీ క్లైమాక్స్ కూడా లేకుండానే సినిమాను ముగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రానాకు మరొకరితో డబ్బింగ్ చెప్పించారు. కేవలం రానా ఇమేజ్ క్యాష్ చేసుకోడానికి ఈ సినిమాను విడుదల చేసారు. క్లైమాక్స్ లేని సినిమా ఏంటంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తూ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు.