రామ్ పోతినేనికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాక్లెట్ బాయ్‌లా కనిపిస్తుంటాడు ఈయన. అప్పుడప్పుడూ మాస్ సినిమాలు చేసినా కూడా ఎక్కువగా క్లాస్ పాత్రలతోనే ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు రామ్. కానీ ఇదంతా రెండేళ్ళ ముందు వరకు. ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.
అప్పటి వరకు పేరు ముందున్న ఎనర్జిటిక్ స్టార్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత కనిపించడం లేదు. ఉస్తాద్ అయిపోయాడు ఈ హీరో. రెడ్ సినిమాలో కూడా రామ్ పేరు ముందు ఉస్తాద్ అనే పడింది. అప్పటి నుంచి ఆ పేరుకు న్యాయం చేయడానికి మ్యాగ్జిమమ్ ప్రయత్నిస్తున్నాడు రామ్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈయన నటిస్తున్న సినిమాకు అదిరిపోయే మేకోవర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది.
లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ది వారియర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. తెలుగు, తమిళంలో సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు రామ్. ది వారియర్ టైటిల్ బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అంచనాలకు రావచ్చు.