ఈ నేపథ్యంలో కృష్ణ మృతిపై తనదైన కోణంలో స్పందించారు రామ్ గోపాల్ వర్మ. కృష్ణ ఇకలేరని బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అక్కడ కూడా లాజిక్ బయటకు తీశారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారని భావిస్తున్నా అంటూ తన నైజాన్ని ప్రదర్శించేలా ట్వీట్ పెట్టారు ఆర్జీవీ. ఈ మేరకు ఆ ఇద్దరి సాంగ్ కూడా జత చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
భార్య ఇందిరా దేవి, పెద్దకుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పెద్దలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ధైర్యంగా ఉండాలంటూ కుమారుడుకు మహేష్ బాబుకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. సూపర్ స్టార్ అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబారు చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం', తొలి ఓ.ఆర్.డబ్ల్యు రంగుల చిత్రం 'గూడుపుఠాణి', తొలి ప్యూజీ రంగుల చిత్రం 'భలే దొంగలు', తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం 'దొంగల దోపిడి', తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (తెలుగు వీర లేవరా..) ఇలా ఎన్నో విభిన్న చిత్రాలతో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ.