ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం ఇదే. మరోసారి ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా పడబోతుందనే వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ అనధికారికంగా మాత్రం సినిమా పోస్ట్ పోన్ అయినట్లే అని తెలుస్తుంది. ఎంతగానో ప్రయత్నించాం కానీ మా వల్ల కాలేదు అంటూ సినిమాలో చివరి నిమిషంలో డాక్టర్లు వచ్చి చెప్తుంటారు కదా.. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుందనే ప్రచారం జోరుగానే జరుగుతుంది.
సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కూడా ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతుంది. నిన్నమొన్నటి వరకు అంతా బాగానే ఉందని అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా.. కొత్త ఏడాది ఉప్పెనలా మళ్లీ కరోనా కేసులు మీద పడిపోతున్నాయి. తగ్గుతుందేమో అని ఆశ పడుతున్న సమయంలో.. నేనింకా పోలేదు.. మీతోనే ఉన్నానని రూపంలోనూ కరోనా వచ్చేసింది. దీని దెబ్బకు ప్రభుత్వాలు అన్నీ మళ్లీ లాక్ డౌన్ ముందు వేసే ఆంక్షలన్నీ వేస్తున్నారు.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ మొదలైపోయింది.. థియేటర్స్లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా మొదలైపోయింది. ఇలాంటి సమయంలో కొత్త సినిమాలు విడుదల చేయడం అనేది మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయం. అందులోనూ పాన్ ఇండియన్ సినిమాలు విడుదల కావడం అనేది సులభం కాదు. ఇప్పటికే డిసెంబర్ 31న రావాల్సిన జెర్సీ వాయిదా పడిందంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి సమయంలో 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా వస్తుందనే చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రమోషన్ కూడా భారీగానే చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తున్నాం అంటున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం అలా కనిపించడం లేదు.
రాజమౌళి ఎంత నమ్మకంగా తమ సినిమా జనవరి 7న వస్తుందని చెప్పినా కూడా దానికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్నారు. నైజాంలోనే 80 కోట్లకు పైగానే పెట్టి కొన్నారు సినిమాను. ఏపీలో కూడా 120 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. హిందీలోనూ ట్రిపుల్ ఆర్ రేంజ్ 200 కోట్లు దాటిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల బిజినెస్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సినిమాను నైట్ కర్ఫ్యూ, థియేటర్స్లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నపుడు విడుదల చేస్తే అంతకంటే దారుణం మరోటి లేదు. సినిమా కలెక్షన్స్ను చేజేతులా నాశనం చేసుకున్నట్లే అంటున్నారు ట్రేడ్ పండితులు. అందుకే ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలి.