మూడు రోజుల్లో 500 కోట్లు.. అసలు ఇది సాధ్యమవుతుందా..? ఒకప్పుడు 500 కోట్లు వసూలు చేయడం అనేది ఇండియన్ సినిమాకు కల. అలాంటిదిప్పుడు కేవలం 3 రోజుల్లో 500 కోట్లు వసూలు చేసింది ట్రిపుల్ ఆర్. నిజానికి ఏడేళ్ల కిందే బాహుబలి సినిమాతో సుసాధ్యం చేశాడు రాజమౌళి. 2015లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 ఏకంగా 850 కోట్లకు పైగా షేర్.. 1200 కోట్లకు పైగా నెట్.. 1700 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇప్పుడు మరోసారి ఇదే మ్యాజిక్ చేయబోతున్నాడు రాజమౌళి. తాజాగా ఈయన తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టిస్తోంది. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెబుతోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్ల సునామీ అసలు ఆగడం లేదు.
విడుదలైన రోజే ఏకంగా 223 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరే ఇతర ఇండియన్ సినిమాకు సాధ్యం కానీ రికార్డు క్రియేట్ చేసింది త్రిబుల్ ఆర్. తర్వాత కూడా సినిమా జోరు అసలు ఆగడం లేదు. తర్వాత రెండు రోజుల్లో 277 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది త్రిబుల్ ఆర్. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం దర్శక నిర్మాతల నుంచి వచ్చింది.
750 కోట్ల దిశగా ట్రిపుల్ అడుగులు పడుతున్నట్లు పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో త్రిబుల్ ఆర్ సృష్టిస్తున్న సంచలనాలు మాటల్లో చెప్పడానికి రావడం లేదు. మూడు రోజుల్లోనే 139 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో కూడా రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. కచ్చితంగా ఇది కూడా 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.