ఆర్ నారాయణ మూర్తి అసలు పేరు రెడ్డి నారాయణ మూర్తి. అయితే వాళ్ళ ఊరిలో అందరు ఆయనను రెడ్డి బాబు అని పిలుస్తూ ఉంటారట. ఆర్.నారాయణమూర్తి మహారాణి కాలేజిలో చదువుతున్నపుడు కాలేజ్ ప్రెసిడెంట్ గా పనిచేసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవాడు. అప్పట్లోనే ఎంతో చురుకుగా ఉంటూ కమ్యూనిజం భావజాలంతో ముందుకెళ్ళేవారు నారాయణ మూర్తి.
ఇంటర్ చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఉన్న మక్కువతో మద్రాసు వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు నారాయణమూర్తి. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో తన మార్క్ చూపించారు. ఇప్పటివరకు 35పైగా సినిమాలో నటించి పీపుల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకంటూ సపరేట్ అభిమాన వర్గం ఉంది.
నారాయణమూర్తి నిర్మాత, దర్శకుడిగా తన మొదటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం చిత్రీకరణను 1984 జూన్ 10న రంపచోడవరంలో ప్రారంభించాడు. ఆ సినిమా పదహారున్నర లక్షల పెట్టుబడితో పూర్తయింది. సెన్సారుతో వచ్చిన చిక్కులను కొంతమంది వ్యక్తుల సహకారంతో అధిగమించి సినిమాను 1986, నవంబరు 6, టి.కృష్ణ వర్ధంతి రోజున విడుదల చేశాడు.